- అపరిశుభ్రతను తరిమేసే వాళ్లే నిజమైన వీరులు
- పారిశుద్ధ్య కార్మికులూ దేశసేవ చేస్తున్న వీరులే
- జనవరి 1కి జీరో వేస్ట్ రాష్ట్రంగా ఏపీ
- స్వచ్ఛతా అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం చంద్రబాబు
విజయవాడ (చైతన్యరథం): పరిశుభ్రతకు నిత్యం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. స్వచ్ఛతను గాంధీజీ దైవంతో పోల్చారని గుర్తు చేశారు. పారిశు ద్ధ్య కార్మికుల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడొద్దని విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే స్వచ్ఛ ఉద్యమం లేదు, స్వచ్ఛ ఆంధ్ర లేదని చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం స్వచ్ఛతా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. జై స్వచ్ఛ సేవక్ అంటూ నినాదం చేస్తూ.. సభికులతో స్వచ్ఛ సేవక్ లకు జై కొట్టించారు. అనంతరం.. మన ఇల్లు, మన ఊరు, మన వీధులను నిరంతరం శుభ్రంగా ఉంచుతోన్న పారిశుద్ధ్య కార్మికులకు వందనం అంటూ ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర సాధన మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
అపరిశుభ్రతను తరిమేసే వాళ్లు నిజమైన వీరులు. ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనికులు టెర్రరిస్టులను ఏరి వేశారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేసే పారిశు ద్ధ్య కార్మికులు కూడా వీరులే. స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోంది. కానీ గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయింది. గత పాలకులు చెత్త పన్ను వేశారు.. చెత్తను వదిలేశారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల మేర చెత్తను గత ప్రభుత్వం వదిలేసిపోయింది. తిరుమలను కూడా అపరిశుభ్రంగా మార్చారు. మేం చెత్త పన్నును రద్దు చేశాం… చెత్తననూ తొలగించాం. లెగసీ వేస్ట్ తొలగించిన మంత్రి నారాయణకు, మున్సిపల్ సిబ్బందికీ అభినందనలు. అక్టోబర్ 2 లక్ష్యంగా పెడితే అంతకు ముందుగానే మంత్రి నారాయణ ఆధ్వర్యంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ చెత్తను విజయవంతంగా తొలగించారని సీఎం చంద్రబాబు అభినందించారు. జనవరి 1 నాటికి ఏపీని జీరో వేస్ట్ రాష్ట్రంగా చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నాం.
త్వరలో 100 స్వచ్ఛ రధాలను అందుబాటులోకి తెస్తాం. పరిసరాలను శు భ్రంగా ఉంచేవాళ్లను గౌరవించుకోవాలి. ప్రతి కార్యాలయంలో, రోడ్ల మీద… ఇలా అన్ని చోట్లా పరిశుభ్రతే కన్పించాలి. స్వచ్ఛమైన, పచ్చనైన, ఆరోగ్యకరమైన రాష్ట్రం కోసం పని చేద్దాం. మన రాష్ట్రంలోని వివిధ నగరాలు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛాంధ్ర సాధ్యం కాకుండా.. స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. సింగపూర్ దేశంలో స్వచ్ఛత పై అధ్యయనం చేసి గతంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అమలు చేశాం. రాత్రిపూట క్లీనింగ్ విధానం కూడా అమలు చేశాం. గ్రీన్ పాస్ పోర్టు ద్వారా విద్యార్థులలో చెట్లు పెంచే అలవాటును పెంచుతున్నాం. యూజ్ అండ్ త్రో పాలసీ కాదు… యూజ్-రికవర్-రీ యూజ్ పాలసీ అమలు చేస్తున్నాం.
అవార్డులు ప్రదానం
స్వచ్ఛాంధ్ర లక్ష్యాల్లో ఉత్తమ పనితీరు కనపరిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ స్వచ్ఛతను పాటించటంలో అగ్రస్థానంలో ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచా యితీలకు సీఎం అవార్డులు ప్రదానం చేశారు. 21 కేటగిరీల్లో రాష్ట్రస్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు విజేతలకు అందించారు. స్వచ్ఛ మున్సిపాల్టీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాల యాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమల కేటగిరీల్లో అవార్డులు ఇచ్చారు.
స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు గానూ రాష్ట్ర స్థాయిలో 6 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీలు అవార్డులు అందుకున్నాయి. మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు, కుప్పం మున్సిపాలిటీలు సీఎం చేతుల మీదుగా అవార్డులు పొందాయి. స్వచ్ఛ గ్రామ పంచాయితీలుగా ఎంపికైన అనకాపల్లి జిల్లా చౌడువాడ, ప్రకాశం జిల్లా ఆర్ఎల్ పురం, కోనసీమ లోని లొల్ల, కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, కడపజిల్లాలోని చెన్నూరు, చిత్తూరు జిల్లాలోని కనమకులపల్లె సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాయి.
స్వచ్ఛతకు పెద్దపీట వేసిన పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, స్వయం సహాయక సంఘాలకు కూడా
ముఖ్యమంత్రి అవార్డులు ప్రదానం చేశారు.
ఈకార్యక్రమంలో మంత్రులు నారాయణ, కొలుసు పార్థసారథి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య, పలువురు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.