- పోలవరం ఎడమ కాలువ పెండిరగ్ పనులకు టెండర్లు పూర్తి
- గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రకు తీరని నష్టం
- ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8,122 క్యూసెక్కులకు తగ్గించిన గత పాలకులు
- కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు న్యాయం
- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు నిధుల కేటాయింపు
- 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి
- జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి
అమరావతి (చైతన్యరథం):ఈ ఏడాది జూలై నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలు, అధికారులను ఆదేశించామని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతిపై ఆయా శాఖాధికారులతో విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండిరగ్ పనులు పూర్తి చేయడానికి రూ.1050 కోట్లతో ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జూలై నాటికి ఎడమ కాలువ పనులు పూర్తిచేసి, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకెళ్ళాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని నెరవేర్చుతామన్నారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల తాగు, సాగు నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అయితే గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఎడమ కాలువ పనులను పక్కనపెట్టడంతో పాటు కనీసం ఒక్క తట్ట మట్టి కూడా తవ్వలేదని, నిర్వాసితులకు ఒక్క రూపాయి నష్టపరిహారం కూడా అందించలేదని విమర్శించారు. ఇదంతా ఒకెత్తు అయితే ఎడమ కాలువ పనులు చేపట్టకపోగా, పనులను ప్రీక్లోజర్ చేసి ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేశారని దుయ్యబట్టారు. అంతేకాకుండా పోలవరం ఎడమ కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుండి 8,122 క్యూసెక్కులకు తగ్గిస్తూ ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు గత ప్రభుత్వం గండికొట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుబట్టారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు వేగవంతం
ఎన్డ్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల్లోనే మొదటి ప్రాధాన్యతగా పోలవరం ప్రాజెక్ట్‌ను, రెండో ప్రాధాన్యతగా పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించారని మంత్రి నిమ్మల రామానాయుడు గుర్తుచేశారు. గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సైతం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.1600 కోట్లను కేటాయించడం హర్షణీయమన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి, ఉత్తరాంధ్రకు తాగు, సాగు నీరందించి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకంతో పోలవరవ డయాఫ్రం వాల్ విధ్వంసమైందని విమర్శించారు. 990 కోట్ల రూపాయలతో డయాఫ్రం వాల్ పున:నిర్మాణం చేయాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో సమయం వృథా కాకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం ఓ దశకు రాగానే సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కూడా మొదలుపెడతామని తెలిపారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రాజెక్టు పనులు ఎప్పటికప్పుడు ప్రతి రోజూ ఎంతమేర జరిగాయని తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకునేలా వెబ్సైట్ రూపొందిస్తున్నామని, ఎప్పటికప్పుడు పనుల వివరాలు వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని వివరించారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమలను సస్యశ్యామలం చేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా రోజువారీ సమీక్షలు నిర్వహించి పనులను వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ ఆర్ కమిషనర్, అధికారులు, ప్రాజెక్ట్ సీఈలు, ఎస్ఈలు, తదితరులు పాల్గొన్నారు.