- పాక్ పర్యాటకులు దేశంనుంచి వెళ్లాలన్న భారత్
- ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన వైనం
- మోదీ నేతృత్వంలోని భద్రతా కేబినెట్ కఠిన నిర్ణయాలు
- పాక్ పౌరులను అనుమతించేది లేదని హెచ్చరిక
- అటారీ- వాఘా చెక్‌పోస్టు తక్షణమే నిలిపివేత
- పాక్‌తో సింధు జలాల ఒప్పందానికీ బ్రేక్
ఢిల్లీ (చైతన్య రథం): ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా కేబినెట్ కమిటీ బుధవారం సమావేశమైంది. ఢల్లీిలోని ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ తదితరులు హాజరైనట్టు సమాచారం. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై చర్చ, స్పందించాల్సిన తీరు, భద్రతా చర్యలు.. తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణణాలు తీసుకున్నారు. దాడి ఘటన గురించి ప్రధాని మోదీకి వివరించిన అమిత్ షా.. తదనంతరం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కమిటీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నప్పటికీ.. అమెరికా పర్యటనలో ఉన్నందున హాజరుకాలేదు.
అయితే, దాడి ఘటన నేపథ్యంలో ముందస్తుగా పర్యటన ముగించుకొని ఆమె స్వదేశానికి బయలుదేరారు. సమావేశంలో కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సహా ప్రధానమంత్రి ఇద్దరు ప్రిన్సిపల్ కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంతదాస్‌లు పాల్గొన్నారు. అంతకుముందు పహల్గాం ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఆయన.. భారత్ త్వరలోనే దీటుగా బదులిస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని.. దీనిని ఎదుర్కోవడంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు.
ఇదిలావుంటే.. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. పహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని పేర్కొన్న కేంద్రం.. ఆ దేశ పర్యాటకులు భారత్‌ను వీడాలని తేల్చి చెప్పింది. పాకిస్థాన్ పర్యాటకులతో పాటు ప్రత్యేక వీసాదారులు 48 గంటల్లో భారత్‌ను వీడాలని ఆదేశించింది. ఈ మేరకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాలను భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాకు వెల్లడిరచారు. పాక్ పౌరుల్ని భారత్‌లోకి అనుమతించ రాదని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాయబార కార్యాలయాల సిబ్బందిని 55నుంచి 30కి తగ్గించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. అటారీ- వాఘా చెక్‌పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్టు చెప్పిన కేంద్రం.. పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించిందన్నారు. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడిరచారు. ఇప్పటికే సరిహద్దు దాటిన వారు మే 1లోగా వెళ్లిపోవాలని మిస్రీ తెలిపారు.