ప్రపంచాన్ని గడగడలాడిరచి అల్లకల్లోలం సృష్టించిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తయారైన వ్యాక్సిన్‌లలో 33శాతం వాటా హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీదే. బయోటెక్ సంస్థను ప్రోత్సహించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఈ జీనోమ్ వ్యాలీలో 200కు పైగా ప్రధాన ఫార్మాస్యూటికల్ కంపెనీలు, 10 వేలమందికి పైగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ప్రపంచం మొత్తంలోని టీకాలలో 3వవంతు ఇక్కడి నుంచే వస్తున్నాయి. విశాలమైన రాజధాని యొక్క ప్రాధాన్యత ఏమిటో హైదరాబాద్‌ను చూస్తే అర్థమవుతుంది. విజన్‌తో హైదరాబాద్‌లో చేసిన అభివృద్ది మన కళ్లముందు ఫలితాన్ని ఇచ్చింది. హైదరాబాద్ కేవలం తెలంగాణకే కాదు… దేశంలోనే నేడు అతిపెద్ద నగరం అయ్యింది. అదే అనుభవంతో అర్థిక, ప్రజా రాజధాని చెయ్యాలని ప్రభుత్వం అమరావతి నిర్మాణం తలపెట్టింది. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటివసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్‌తో ఆహ్లాదకరమైన, ప్రపంచస్థాయి నగరంగా రాజధాని ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభంకానున్నాయి. ప్రణాళికాబద్దంగా పనిచేసి నాడు దెబ్బతీసిన బ్రాండ్‌ను పునరుద్దరిస్తూ ప్రజలు గర్వంగా చెప్పుకునేలా, ప్రపంచస్థాయి నగరంగా రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టారు.
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే ఇతర రాష్ట్రాలకు ధీటుగా రాజధాని ఉండాలన్న ఉద్దేశంతో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. చంద్రబాబునాయుడుపై నమ్మకంతో రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా రేయింబవళ్లు క్యూలో నిలబడి 58 రోజుల్లో 34,281 ఎకరాల భూముల్ని స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. 2015 అక్టోబర్ 22న రాజధానికి ఉద్దండరాయునిపాలెంలో దేశం మనవైపు చూసేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 2015లో పనులు ప్రారంభించి హైకోర్టు, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల నివాస భవనాలు, రహదారుల నిర్మాణాన్ని చేపడితే జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా వ్యవహరించి భూములిచ్చిన రైతులను అక్రమ కేసులతో వేధించి, అవమానించి రాజధాని పనులు నిలిపివేశారు. వైసీపీ హాయంలో ఐదేళ్లపాటు అక్కడే ఆగిపోయిన మహత్కార్యం.. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ దేదీప్యమానమైంది. ఏపీ రాష్ట్రానికి ఆత్మలాంటి రాజధాని అమరావతిని ‘విశ్వనగరి’గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నడుంగట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు శంకుస్థాపనకు నోచుకుంటున్న వేల కోట్ల ప్రాజెక్టులు `ఏపీలో అద్భుత అమరావతి ఆవిష్కరణకు బాటలు వేస్తాయని ఆశిద్దాం.
రావి రాధాకృష్ణ
గల్ఫ్ తెదేపా కౌన్సిల్ అధ్యక్షుడు