- అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన
- ఇవీ భారత ప్రధాని నరేంద్ర మోదీ నినాదాలు..
- రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే సుదినమిది..
- ఏకకాలంలో రూ.2,08,548 కోట్ల పనులకు శ్రీకారం
- ఇంతటి శుభదినం నా జీవితంలో ప్రథమం..
- నదుల అనుసంధానానికి కేంద్రం సాయం చేయాలి
- ఎన్డీయే కాంబినేషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుంది
- విశాఖ సభలో సీపం చంద్రబాబు ఉద్ఘాటన
- ప్రధాని మోదీతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం
అనకాపల్లి (చైతన్య రథం): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడని, మోదీ దేశానికే కాకుండా ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గ్లోబల్ లీడర్‌గా ఉంటారని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ప్రధాని మోదీ స్ఫూర్తితో ముందుకెళ్తామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రూ.2,08,548 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ఇటువంటి శుభదినం నా జీవితంలో చూడలేదు
‘సభకు తరలొచ్చిన ప్రజానీకాన్ని చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం కలుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో అదిరింది. ప్రజల్లో విశ్వాసం, నమ్మకమున్న నాయకుడు ప్రధాని మోదీ. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో రూ.2,08,548 కోట్ల విలువైన పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇటువంటి శుభదినం నా జీవితంలో మొదటిసారి. పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్‌లో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. విశాఖవాసుల చిరకాల కాంక్ష అయిన రైల్వేజోన్‌కు కూడా శంకుస్థాపన చేశాం. రైల్వే జోన్‌కు భూమి కేటాయించాలని కేంద్రం అడిగినా గత ప్రభుత్వం ఇవ్వలేదు. అధికారంలోకి రాగానే 52 ఎకరాల భూమి ఇచ్చాం. నేడు ప్రధాని ఆశీస్సులతో జోన్ పనులు ప్రారంభమయ్యాయి. నక్కపల్లిలో రూ.1877 కోట్లు పెట్టుబడులతో బల్క్ డ్రగ్ పార్క్, రూ.4,593 కోట్లతో 10 ప్రాజెక్టులకు సంబంధించి రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులు, రూ.2,139 కోట్లతో కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్, రూ.6,028 కోట్లతో 6 రైల్వే ప్రాజెక్టులు, రూ.3,044 కోట్లతో 234.28 కి.మీ రోడ్లు, రూ.5,718 కోట్లతో 323 కి.మీ మూడు రైల్వే లైన్ పనులకు శంకుస్థాన చేసుకున్నాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ ఈ కాంబినేషన్..
‘మన ప్రభుత్వం వచ్చి ఏడునెలలే అయింది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఏపీకి మోదీ మొదటిసారి వచ్చి రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాన, ప్రారంభోత్సవాలు చేయడంపై ధన్యవాదాలు తెలుపుతున్నా. అనునిత్యం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు ప్రధాని మోదీ దగ్గరయ్యారు. మోదీపై అభిమానం ఉత్తరాదికి పరిమితం అంటున్నారు. కానీ మోదీ.. దేశం, ప్రపంచం మెచ్చే నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో నరేంద్రమోదీ, నా మిత్రుడు పవన్ కళ్యాణ్, నేను కలిసి పోటీ చేశాం. రాష్ట్ర చరిత్రలో లేని విజయాన్ని ప్రజలు మాకు ఇచ్చారు. 93 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లు వేసి 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ స్థానాల్లో విజయం కట్టబెట్టారు. భవిష్యత్తులోనూ ఏపీలో ఇదే కాంబినేషన్ కొనసాగుతుంది. ప్రధానిగా మోదీ ఉంటారు. హర్యానా, మహారాష్ట్రలో మోదీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించిందంటే అదీ మోదీ చరిష్మా. రాసిపెట్టుకోండి ఢల్లీిలో గెలిచేది కూడా ఎన్డీయేనే. దానికి కారణం దేశం కోసం మోదీ పని చేసిన విధానం’ అని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.
మోదీ నినాదం సంక్షేమం, అభివృద్ధి
‘మోదీజీ… ప్రజల కోసం నిత్యం పోరాడే మీకు ప్రజలంతా అండగా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన అనే నినాదాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి రైతులకు రూ.6 వేలు ఇస్తున్నారు. కరోనా సమయం నుంచి ఉచిత రేషన్ ఇస్తున్నారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారత మాలవంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇళ్లులేని పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారు. జనవరి 1న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా పీఎం పసల్ బీమాను పెంచారు. రూ.3,850 కోట్లతో ఎరువుల సబ్సిడీ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పేదల కోసం పీఎం సూర్యఘర్, కుసుమ్‌వంటి పథకాలను తీసుకొచ్చారు. 7నెలల్లోనే ఇవన్నీ చేయగలిగారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదాలతో మోదీ ముందుకెళ్తున్నారు. 2014 నాటికి ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారత్‌ను 5 స్థానానికి తీసుకొచ్చారు. 2029 నాటికి 3వ స్థానానికి, 2047నాటికి ప్రపంచంలో దేశం రెండు లేదా మొదటి స్థానంలో ఉంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇది మరెవరికీ సాధ్యం కాదు… ఒక్క మోదీకే సాధ్యం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఊపందుకున్న పెట్టుబడులు
‘విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని కోరారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఏపీ జీవనాడి అయిన పోలవరం పనులు ఆగకుండా జరగడం కోసం 7 ముంపు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ నాడు తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించారు. విభజన హామీల్లో భాగంగా ఐఐటీ, ఐఐఎం, నిట్, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ వర్సీటీ వంటి దాదాపు 12 సంస్థలను రాష్ట్రానికి కేటాయించారు. మళ్లీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో పెంచిన పింఛన్లు, అన్న క్యాంటీన్లు, దీపం కింద ఆడబిడ్డలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. ఎన్నికల ముందు చెప్పిన విధంగా సూపర్-6 హామీలను అమలు చేసే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుంది. కష్టాలు, సమస్యలు ఉన్నాయి అధిగమిస్తాం. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని సుపరిపాలనలో ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో పెట్టుడులు ఊపందుకున్నాయి. రాష్ట్ర బ్రాండ్‌ను పెంచుకుంటున్నాం. దేశానికి ముంబై ఏవిధంగా ఆర్థిక రాజధానిగా ఉందో, మన రాష్ట్రానికి విశాఖపట్నం కూడా ఆర్థిక రాజధాని. ఐటీ, ఫార్మా, పర్యాటక రంగాలు విశాఖలో పురోగతిలో ఉన్నాయి. ప్రధాని మోదీ అరకు కాఫీని ప్రమోట్ చేయడంతో ప్రపంచం మొత్తం మోస్ట్ బ్రాండ్‌గా తయారైంది’ అని సీపం చంద్రబాబు పేర్కొన్నారు.
మోదీజీ… మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం
‘మోదీజీ… మీరు అభివృద్ధికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేము మిమ్మల్ని ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకుంటాం. అమరావతి రాజధానికి మీరే శంకుస్థాపన చేశారు. మీ ఆశీస్సులతోనే రాజధానిని పూర్తి చేసుకుంటాం. దాన్ని మీరే ప్రారంభిస్తారు. మీరు ఒకసారి అమరావతి రావాలని కోరుతున్నాం. నదుల అనుసంధానికి కూడా మీరు ప్రాధాన్యమిస్తారు. పోలవరం ప్రాజెక్టును మీ నాయకత్వంలో పూర్తి చేస్తాం. మీ ఆశీస్సులతో నదుల అనుసంధానం ప్రారంభిస్తున్నాం. మీ ఆశీస్సులతోనే పూర్తి చేస్తాం. బీపీసీఎల్ ప్రాజెక్టు అత్యంత వెనకబడిన ప్రాంతమైన రామాయపట్నం వచ్చింది. రాష్ట్ర ప్రజల మీకు ధన్యవాదాలు చెబుతున్నారు. గూగుల్ కూడా ఏఐలో పెట్టుబడులు పెట్టేందుకు విశాఖపట్నం వస్తోంది. గూగుల్ ప్రతినిధులు నాతో సమావేశమైనప్పుడు భవిష్యత్తులో పన్నులు పెంచే అవకాశం ఉందా? అని ప్రస్తావించారు. ఇటీవల ప్రధానితో సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావించాను. ప్రభుత్వం తెచ్చిన పాలసీల్లో మార్పులు ఉండవు.. మీరు ధైర్యంగా ముందుకెళ్లండని చెప్పారు. దీనికంటే విశాఖ ప్రజలకు ఏంకావాలి? మోదీజీ… మీ బడి, నా బడి ఒకటే. రేపు చేయాల్సిన పని, నిన్ననే చేసి ఉంటే బాగుండేదని ఆలోచించే ప్రధాని ఉండటం మన రాష్ట్ర ప్రజల అదృష్టం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ఎన్డీయే విధానం. కొప్పర్తి, ఓర్వకల్లుకు ఇండస్ట్రియల్ పార్కులు వచ్చాయి. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. వికసిత్ భారత్ నరేంద్ర మోదీ కల. స్వర్ణాంధ్రప్రదేశ్ మన కల. ప్రధాని దేశాన్ని ప్రపంచంలో నిలబెడితే… 2047 నాటికి ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉండాలి. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు సరైన సమయంలో మోదీ దేశానికి ప్రధాని అయ్యారు’ అని సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.
ఇక విజయాలు తప్ప అపజయాలు ఉండవు
‘మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు నిరంతరం కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాన్ని చేరుకోలేం. నిరంతర పాలన ఇస్తే ఏవిధంగా అభివృద్ధి జరుగుతుందో చేసి నిరూపించిన వ్యక్తి మోదీ. ఎన్డీయే బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. ఇక్కడ కూటమి ధృడంగా ఉంటే ఏపీ బలంగా ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్… డబుల్ డిజిట్ గ్రోత్. రెండు ప్రభుత్వాలు ఒక్కటిగా ఉంటే రెండంకెల వృద్ధి సాధ్యమై పేదరికం పోతుంది. కూటమి తరపున హామీ ఇస్తున్నా… పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం. ఇది మొదటి అడుగు… ఇక జయాలే తప్ప అపజయం ఉండదు.’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.