- నారా భువనేశ్వరి ఉద్ఘాటన
- మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు
- వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
- వారి ఆర్థిక స్వావలంబన కోసమే సీఎం చంద్రబాబు డ్వాక్రా తెచ్చారు
- కుప్పంలో ఎలీప్ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన భువనేశ్వరి
కుప్పం (చైతన్యరథం): మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, మహిళలకు అవకాశాలు ఇవ్వాలేకానీ అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు వారి కాళ్లపై వారు నిలబడి ఆర్థికంగా బలోపేతం కావడం కోసమే సీఎం చంద్రబాబు గతంలో డ్వాక్రా సంఘాలు స్థాపించారని, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎలీప్ ఆధ్వర్యంలో మహిళలకు 6 రోజులపాటు నిర్వహించే శిక్షణా తరగతులను నారా భువనేశ్వరి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్ధేశించి మాట్లాడారు.
ఎలీప్ నా మనసు దోచుకుంది
మహిళల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరైన శిక్షణ అందించడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడంలో ఎలీప్ చేస్తున్న కృషి నా మనసును దోచుకుంది. రమాదేవి ఆమె టీం సభ్యులందరూ ఎలీప్ ద్వారా అనేకమంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు. అందుకోసం వారు హైదరాబాద్ లో ఇన్నాళ్లు చేసిన కృషి అమోఘం. అందుకు వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని భువనేశ్వరి అన్నారు.
మహిళలు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి
చంద్రబాబు హైదరాబాద్‌లో ఎలీప్ ఏర్పాటు చేశారు. ఎలీప్ నా కళ్ల ముందు పుట్టి ఎదిగింది. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం కుప్పంలోనూ ఎలీప్ ఏర్పాటు కాబోతోంది. ఎలీప్ ఏర్పాటు విషయంపై ఐఏఎస్ అధికారి వికాస్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను. దీని ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారై మరో పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకుంటారు. స్త్రీలు శక్తిమంతులు. మగవారిని మించి పనిచేయగలరు. నేను ఇది చేయలేను అనే భయం లేకుండా ముందడుగు వేయాలి. అప్పుడే అద్భుతాలు సాధించగలరు. సాధారణ గృహిణిగా ఉన్న నాకు చంద్రబాబు హెరిటేజ్ సంస్థ బాధ్యతలు అప్పగించారు. అన్నీ స్వయంగా నేర్చుకున్నాను. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము కూడా మహిళల ఆర్థిక స్వావలంబనకు పాటుబడుతున్నాం. వారి స్వయం ఉపాధికి చేయూత అందిస్తున్నాము. కుప్పం పరిధిలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. వాటిలో పని చేయడం ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని నారా భువనేశ్వరి అన్నారు.