అమరావతి (చైతన్య రథం): ‘పేదవ సేవలో’ పేరిట నిర్వహిస్తోన్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు స్వయంగా నా చేతులతో లబ్దిదారులకు అందించడం చాలా సంతృప్తినిస్తోంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలు సాదకబాధకాలు తెలుసుకునే అవకాశం కలుగుతోందని పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ‘ఈరోజు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ‘పేదల సేవలో పేరిట నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను. పేదల పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తూ.. ప్రతి నెలా 63 లక్షల మందికి 28 రకాల పింఛన్లు ఇస్తున్నాం. మరే రాష్ట్రంలోనూ ఇంత మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదు. అందుకే ఏపీలో పింఛన్ల పంపిణీ దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమంగా నిలుస్తోంది. పేదలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పింఛను ఇవ్వడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. అందుకే ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ప్రజల స్థితిగతులు, సాధకబాధకాలు తెలుసుకుంటున్నాను. ఇందులో భాగంగా మంగళవారం చినగంజాం మండలం, పెదగంజాం పంచాయతీ పరిధిలోని కొత్తగొల్లపాలెంలో మానసిక దివ్యాంగురాలైన వడ్లమూడి సుభాషిణి ఇంటికి వెళ్లి పింఛన్ అందించాను.
సుభాషిణి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు, ఆమె తల్లికి ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించాను. బాగా చదివి పోలీస్ అవ్వాలనుకుంటున్న సుభాషిణి చెల్లెలు భరణిని కస్తూర్బాగాంధీ పాఠశాలలో చేర్పించాలని అధికారులకు సూచించాను. అలాగే మరో లబ్దిదారు బత్తుల జాలమ్మ ఇంటికి వెళ్లి వితంతు పెన్షన్ అందించాను. శిథిలావస్థలో ఉన్న జాలమ్మ ఇంటిని చూసి తీవ్ర ఆవేదన చెందాను. వెంటనే ఆమెకు గృహంతోపాటు వంట గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వమని అధికారులకు సూచించాను. అలాగే ఆమె కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయమని చెప్పాను. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొన్నాను. పీ-4 కార్యక్రమంలో భాగంగా పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు విక్రమ్ నారాయణరావు, వసంత శ్రీనివాసరావు అనే మార్గదర్శకులు చెరొక 15 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చారు. వారికి నా అభినందనలు. పర్చూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభ్యర్థన మేరకు షిప్ బిల్డింగ్, షిప్ రిపేరింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వంనుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చాను’ అని పేర్కొన్నారు.