- అదీ.. సామాజిక సేవలో భాగమే
- మన ఉత్పత్తులు అంతర్జాతీయ బ్రాండ్‌కావాలి
- యువ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు
అమరావతి (చైతన్య రథం): పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్‌లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఎంట్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని సీఎం స్పష్టం చేశారు. అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్సు, స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ ఇలా వేర్వేరు రంగాల్లోవున్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
విశాఖ-చెన్నై మధ్య నాలుగు లేన్ల రైల్వే లైన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత పరిస్థితి పూర్తిగా మారుతుందన్నారు. సమీప భవిష్యత్తులో అమరావతి- హైదరాబాద్- బెంగుళూరు- చెన్నై అతిపెద్ద కారిడార్‌గా మారుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కారిడార్ ఏర్పాటు కానుందని, అలాగే విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని సీఎం తెలిపారు. వివిధ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటుకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను తయారు చేసేందుకు విద్యా మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 33శాతం పచ్చదనాన్ని 50 శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా దేశాల పేర్లను సూచించేలా పార్కులతో సుందరీకరణ చేపడుతున్నట్టు వెల్లడిరచారు.
ఆంధ్రాప్రెన్యూర్స్ పేరు నిలబెట్టండి
యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం నడుపుతున్న సంస్థలను మరింత వృద్ధిలోకి తేవాలని.. ఆంధ్రాప్రెన్యూర్స్ అనే పేరు నిలబెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వం రూపొందిస్తున్న పాలసీలను వినియోగించుకుని అంతర్జాతీయస్థాయికి తమ సంస్థలను తీసుకెళ్లాలని సీఎం అన్నారు. ఏ పరిశ్రమకైనా.. వ్యాపారానికైనా విశ్వసనీయతే ముఖ్యమని.. దానిని నిలబెట్టు కొనేందుకు నిరంతరం శ్రమించాలని ముఖ్యమంత్రి అన్నారు. స్వర్ణాంధ్ర విజన్`2047కు అనుగుణంగా రాష్ట్రంలో పారిశ్రామిక ఎకో సిస్టంను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్‌తోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.