- ఆన్‌లైన్ సమస్యలపై అర్జీలు సమర్పించిన బాధితులు
- సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామన్న ప్రతినిధులు
- అర్జీలు స్వీకరించిన నేతలు పల్లా, కొల్లు, బొరగం
అమరావతి (చైతన్య రథం): ‘ఎమ్మార్వో, వీఆర్వోలే అక్రమంగా మా భూమిని మరొకరి పేరిట మార్చారు. దీనిపై ఉన్నతాధికారులు విచారించి మా భూమి మాకు దక్కేలా చూడండి’ అంటూ చిత్తూరు జిల్లా సదుం మండలం కంభంవారిపల్లెకు చెందిన బండి మంజుల గ్రీవెన్స్‌లో అర్జీ సమర్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో నేతలు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు అర్జీలు స్వీకరించారు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామానికి చెందిన సయ్యద్ బాషా విజ్ఞప్తి చేస్తూ.. తన తాతగారి ఆస్తిని వైసీపీ మాజీ సర్పంచ్ సులేమాన్ సాహెబ్ కబ్జా చేశాడని.. కబ్జా నుండి తమ స్థలాన్ని విడిపించి న్యాయం చేయాలని గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు. అలాగే, ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం నుంచి పుల్లలచెరువు వరకు ఉన్న రహదారి చిన్నది కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని.. దాన్ని డబుల్ రోడ్డుగామార్చి వాహనదారుల సమస్యలు పరిష్కరించాలని.. అలాగే యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, పెద్దారవీడు మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు దృష్టి పెట్టి గ్రామాల్లోని తాగునీటి సమస్యను పరిష్కరించాలని తూమాటి అచ్చయ్య విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడుకు చెందిన బండ్లమూడి సుజని విజ్ఞప్తి చేస్తూ.. తనకు తన నానమ్మ ద్వారా వారసత్వంగా వచ్చిన భూమిని ఆనలైన్ చేయకుండా మరొకరికి ఆన్‌లైన్ చేశారని.. జరిగిన తప్పును సరిచేసి భూమి తమ పేరుమీద ఆన్‌లైన్ చేయాలని నేతలకు అర్జీ సమర్పించారు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం మూగవారిపల్లె గ్రామానికి చెందిన మల్లెల వెంకటకుమార్ విజ్ఞప్తి చేస్తూ.. తనకు వెన్ను సమస్య కారణంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగానికి మూడు నెలలు సెలవు పెట్టడంతో ఉద్యోగాన్ని తొలగించారని.. తనను తిరిగి విధుల్లోకి తీసుకునేలా అధికారులకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోటకు చెందిన ఉప్పలపాటి వెంకటకృష్ణారావు గ్రీవెన్స్‌లో నేతలకు అర్జీ ఇస్తూ.. ఎన్నిసార్లు అధికారులకు అర్జీలు పెట్టినా తమ భూమిని సర్వే చేసి హద్దులు చూపడంలేదని.. అధికారుల నిర్లక్ష్యంతో చెరువును ఎండగట్టాల్సిన పరిస్థితి ఏర్పడిరదని.. దాంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని.. వెంటనే సర్వే చేసి ఎవరి భూములు వారికి హద్దులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వంలో తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో తమ పేర్లను తొలగించి తమ భూములను అధికారులు మరోకరి పేరుపై మార్చారని.. అవక తవకలపై విచారణ జరిపి భూమి తమకు దక్కేలా న్యాయం చేయాలని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన సి శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన బొగ్గు శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వంలో సుమారు 44 ఇళ్లను 40 ఇండ్ల స్థలాలను అక్రమంగా అర్హులకు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నేతలకు ఫిర్యాదు చేశారు. సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బాధితులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు హామీ ఇచ్చారు.