- అభివృద్ధి.. సంపద సృష్టి.. పేదరిక నిర్మూలన
- రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు ఇవే..
- క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను బ్యాంకర్లు అధిగమించాలి
- సౌత్ ఇండియాలో మనమే మేటి కావాలి
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయి
- ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకులు చేయూతనివ్వాలి
- బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు
- 2025-26కు రూ.6.6 లక్షల కోట్ల క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ
- గత ఏడాదికంటే 22 శాతం అధికంగా రుణ ప్రణాళిక
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన 231వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం
అమరావతి (చైతన్య రథం): వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని… ఓవైపు స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు అనుగుణంగా పనిచేస్తూనే, మరోవైపు 2029నాటికి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతివ్వాలని కోరారు. 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని మంగళవారం సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి, 2025-26 లక్ష్యాలను నిర్దేశించారు. నూరుశాతం లక్ష్యాలను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు ముఖ్యమంత్రి బ్యాంకర్లను అభినందించారు. సమావేశంలో 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి ‘ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్’ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలం అనేది బ్యాంకర్లు ఆలోచించాలని సూచించారు.
ఆర్ధిక మద్దతుకే ఎస్‌ఎల్‌బీసీ సమావేశాలు:
తాను ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా తరచూ ఎస్‌ఎల్‌బీసీ సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం… రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బ్యాంకుల మద్దతు కూడగట్టేందుకేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సేవలు, పరిశ్రమల రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని… కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రాధాన్యతలు మారాయని… ఆంధ్రప్రదేశ్ వ్యవసాయరంగ ఆధారిత రాష్ట్రం కావడం, దీనిపై ఎక్కువమంది ఆధారపడి జీవిస్తుండటంతో వ్యవసాయరంగానికి అండగా నిలిచామన్నారు. వ్యవసాయ అనుబంధరంగాలను సైతం బలోపేతం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
బ్యాంకుల సహకారంతోనే పురోగతి
డిమాండ్‌కు తగ్గట్టుగా ఏరంగం పురోగతి సాధించాలన్నా బ్యాంకుల మద్దతు తప్పనిసరి అని చంద్రబాబు అన్నారు. వివిధ రంగాల్లో భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయని, వాటికి అవసరమైన ఆర్ధిక మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంటికో ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈలు, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 2029కల్లా పేదరికం నిర్మూలించేలా జీరోపావర్టీ-పీ4 అమలు చేసి అసమానతలు తొలిగించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సంపద సృష్టికి, మౌలిక సదుపాయాల కల్పనకు పీపీపీ విధానాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తున్నామన్నారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి మా విధానం
విశాఖ ఆర్ధికాభివృద్ధిలో అనూహ్య పురోగతి సాధిస్తోందని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. అలాగే అమరావతి భవిష్యత్ అవకాశాలకు వేదికగా చేస్తున్నామని, అటు రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అన్నారు. పెట్రో కారిడార్‌పై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని, మత్స్యకారులు మధ్యవర్తుల ప్రమేయంతో నష్టపోతున్నారని… వారికి నేరుగా రుణాలు ఇవ్వాలని సూచించారు. సముద్ర ఆర్ధిక వ్యవస్థలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చని దీనికి బ్యాంకర్ల మద్దతు అవసరమని సీఎం చంద్రబాబు కోరారు.
అన్నివర్గాలకు విరివిగా రుణాలు
ఇంటికో ఎంట్రప్రెన్యూర్‌ను తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆశయం మేరకు క్రెడిట్ ప్లాన్ అమలు చేస్తున్నామని… ఈ ఆర్ధిక సంవత్సరంలో కచ్చితంగా లక్ష్యాన్ని అధిగమిస్తామని ముఖ్యమంత్రికి బ్యాంకర్ల తెలిపారు. ప్రత్యేకంగా మహిళా ఎంట్రప్రెన్యూర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. స్వయం సహాయక బృందాలకు రుణాలు విరివిగా అందిస్తున్నామని చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్, హౌసింగ్ విషయంలోనూ ప్రత్యేక దృష్టి సారించామని చంద్రబాబు అన్నారు.
లక్ష్యాన్నిమించి క్రెడిట్ ప్లాన్ అమలు
2024-25 ఆర్ధిక సంవత్సరానికి మొత్తం క్రెడిట్ ప్లాన్ రూ.5,40,000 కోట్లు లక్ష్యం పెట్టుకోగా, లక్ష్యాన్ని అధిగమించి రూ.6,83,672 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. ఇది లక్ష్యంలో 127 శాతం వృద్ధి. ఇందులో ప్రయారిటీ సెక్టార్‌కు రూ.4,14,824 కోట్లు, నాన్ ప్రయారిటీ సెక్టార్‌కు రూ.2,68,848 కోట్లు అందించాయి.
వ్యవసాయరంగం
గడిచిన ఆర్ధిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వరకు చూస్తే క్రెడిట్ ప్లాన్ రూ.2,64,000 కోట్లు లక్ష్యంకాగా, అంతకుమించి రూ.3,07,089 కోట్లు బ్యాంకులు అందించాయి. ఇది లక్ష్యంలో 116 శాతం వృద్ధి. ఇందులో ఖరీఫ్‌లో రూ.1,69,797 కోట్లు, రబీలో రూ.1,37,291 కోట్లు అందించాయి.
ఎంఎస్‌ఎంఈలు
రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ఎంఎస్‌ఎంఈ రంగాలకు ఈసారి భారీఎత్తున క్రెడిట్ ప్లాన్ అమలు చేశారు. గత ఆర్ధిక సంవత్సరం మొత్తం రూ.87,000 కోట్ల లక్ష్యానికిగాను… రూ.95,620 కోట్లు ఇచ్చాయి. ఇది లక్ష్యంలో 110 శాతం వృద్ధి. ఇందులో మైక్రో ఎంట్రప్రైజెస్‌కు రూ.49,552 కోట్లు, స్మాల్ ఎంట్రప్రైజెస్‌కు రూ.27,632 కోట్లు, మీడియం ఎంట్రప్రైజెస్‌కు రూ.18,138 కోట్లు, ఇతర వాటికి రూ.298 కోట్లు అందించాయి.
వృద్ధిశాతం తగ్గడంపై ప్రశ్నించిన ఆర్ధిక మంత్రి
మరోవైపు క్రెడిట్ ప్లాన్ అమలులో ప్రతీ ఏటా వృద్ధి రేటు పడిపోవడంపై బ్యాంకర్లను ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. 2021-22 సంవత్సరంలో లక్ష్యంలో వృద్ధి 133శాతం, 2022-23లో 163శాతం, 2023-24లో 138 శాతం ఉండగా… 2024-25లో లక్ష్యంలో వృద్ధి 127 శాతమే ఉండటంపై వివరణ అడిగారు.
2025-2026 క్రెడిట్ ప్లాన్ ఇలా..
2024-25 ఆర్ధిక సంవత్సరానికి మొత్తం ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ రూ.5,40,000 కోట్లు ఉండగా, 2025-26 ఆర్ధిక సంవత్సరానికి 22 శాతం అధికంగా రూ.6,60,000 కోట్లకు లక్ష్యాన్ని పెంచారు. ఇందులో వ్యవసాయ రంగం లక్ష్యం రూ.3.06,000 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రూ.1,28,000 కోట్లు ఉంది. మొత్తం ప్రాధాన్యరంగానికి రూ.4,58,000 కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి రూ.2,02,000 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు.