- చంద్రబాబు, టీడీపీ నేతల పిటిషన్లపై విచారణ
- తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా
అమరావతి: ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడం పట్ల ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 16లోగా కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడుపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. మార్చి ఒకటో తేదీన డీజీపీకి లేఖ రాసినప్పటికీ ఈరోజు వరకు వివరాలు ఇవ్వకపోవడంపై సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై కేసులకు సంబంధించి ఇంతవరకు వివరాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి శ్రీనివాస్ తీసుకొచ్చారు.
ఎన్నికల నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో తమపై ఉన్న కేసుల వివరాలను కూడా అభ్యర్థులు అందజేయాల్సి ఉంది. వారిచ్చే సమాచారంలో ఏ ఒక్కటి మిస్ అయినా వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని న్యాయవాదులు దమ్మాలపాటి, ఉమేష్ చంద్ర, వివి సతీష్ పేర్కొన్నారు. ఆ వివరాలు పేర్కొనకపోతే నామినేషన్లు తిరస్కరించే అవకాశం ఉందని కోర్టుకు లాయర్లు వివరించారు. ఈ సమాచారం మొత్తాన్ని ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుందని, డీజీపీ కార్యాలయానికి ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. గతంలో రఘురామకృష్ణరాజుపై ఉన్న కేసుల వివరాలను డీజీపీనే ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా లాయర్ ఉమేష్ చంద్ర గుర్తుచేశారు. కేసుల వివరాలు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు.
అవసరమైతే నలుగురు అధికారులను నియమించి వెంటనే కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. డీజీపీని అడిగి వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 18 నుంచి నామినేషన్లు ప్రారంభమై 25తో ముగుస్తాయని, అందువల్ల వెంటనే వివరాలు ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 16కు వాయిదా వేసింది.