- అర్హులైన గౌడలకు సంక్షేమ పథకాలు అందిస్తాం
- ప్రతి ఇంట్లో పారిశ్రామిక వేత్తలను తయారుచేస్తాం
- గౌడ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి
- విజయవాడలో పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం
- పాల్గొన్న మంత్రులు కొలుసు, అనగాని, సత్యప్రసాద్
విజయవాడ(చైతన్యరథం): గౌడ కుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తామని ఏపీ గౌడ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తెలిపారు.. బెంజి సర్కిల్‌లో కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో ఏపీ గౌడ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా వీరంకి వెంకట గురుమూర్తి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ బీసీ కులాల చేతివృత్తులకు పూర్వవైభవం తీసుకు వస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గీత వృత్తిని మరింత ప్రోత్సహిస్తామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన గౌడ్ కుల కార్పొరేషన్ చైర్మన్ పదవి రాష్ట్రంలోని బీసీలకు సేవ చేసే అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పా రు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఒక్క ఏడాదిలోనే రూ.39,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందని వివరించారు. గౌడ కులాలు ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా కేరళలో ఉన్న నీరా ఉప ఉత్పత్తులను అక్కడ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఏపీలో కూడా ఉప ఉత్పత్తులను ప్రోత్సహిస్తామన్నారు. ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్తలను తయారుచేయాలన్నదే ముఖ్య మంత్రి చంద్రబాబు లక్ష్యమని.. గౌడ కులాల్లో కూడా పరిశ్రమలు పెట్టుకునేలా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.
గురుమూర్తికి పదవి హర్షణీయం
గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ నమ్ముకున్న వారికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటూ వారి పక్షాన నిలబడుతుందన్నారు. ఈ పదవి రావడం ఆయన చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. నాకు 25 సంవత్సరాలుగా గురుమూర్తి వ్యక్తిగతంగా తెలుసునని చెప్పారు. బీసీలకు అండగా ముఖ్యమంత్రి అనేక పథకా లను అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం గౌడ కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ గురుమూర్తి పార్టీ కోసం, బీసీల కోసం ఐదేళ్లలో ఎంతో కష్టపడ్డారని దాని ఫలితమే ఈ పదవి అని కొనియాడారు. ఎన్టీఆర్ బడుగుల కోసం పాటుపడితే ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ ముందుకునడిపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ప్రశంసించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నేడు ఎంతోమంది బీసీలు ప్రముఖ స్థానంలో ఉండటానికి కారకులు స్వర్గీయ ఎన్టీఆర్ అని..పార్టీ కోసం శ్రమించిన గురుమూర్తికి కార్పొరేషన్ పదవి ఇస్తూ సముచిత స్థానం కల్పించడం హర్షణీయమన్నారు.
గత ప్రభుత్వంలో బీసీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని తెలిపారు. ముందుగా ఏపీ గౌడ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా వీరంకి వెంకట గురు మూర్తి చేత సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.తనూజరాణి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, అంగర రామ్మోహన్, ఎమ్మెల్యేలు వర్ల కుమార రాజా, గద్దె రామ్మోహన్, వెనిగండ్ల రాము, నక్కా ఆనంద బాబు, బోడే ప్రసాద్, గౌతు శిరీష, కాగిత కృష్ణప్రసాద్, తంగిరాల సౌమ్య, నిమ్మకాయల చినరాజప్ప, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కొనకళ్ల నారాయణ, కొమ్మా ండ్డి పట్టాభిరామ్, రావి వెంకటేశ్వరరావు, లంకా దినకర్, మాజీ పార్లమెం ట్ సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్, ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, నాయకులు నాగుల్ మీరా, గొట్టిపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.