- అధునాతన ఆవిష్కరణలను ప్రోత్సాహం
- ఇన్నొవేషన్, ఇంక్యుబేషన్లకు ప్రాధాన్యత
- అందుకే రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ఏర్పాటు
- పాలిటెక్ ఫెస్ట్‌లో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): జీవన ప్రయాణంలో అనేక ఇబ్బందులు వస్తాయి.. ఎదురుదెబ్బలు తగలొచ్చు.. కిందపడ్డాక ఎంత త్వరగా పైకి లేస్తామనేది ముఖ్యం.. అనుకున్నది సాధించేవరకు పట్టువదలొద్దని విద్యార్థులకు రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. విజయవాడ లబ్బీపేట ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన పాలిటెక్ ఫెస్ట్‌కు మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు అధునాతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… నేను విద్యాశాఖ మంత్రి అయినపుడు.. మన ఐటిఐ, పాలిటెక్నిక్‌లు ఒకస్థాయికి వచ్చాయి, ఇక్కడితో ఆగకూడదు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తయారుకావాలి, మార్కెట్ లింకేజి అవసరమని హెచ్‌ఆర్‌డీ కార్యదర్శితో చెప్పానన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంత అద్భుతమైన పిల్లలు, ఐడియాలు ఉన్నాయని ఈ రోజే తెలుసుకున్నాను.
2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిందే ఈ పాలిటెక్ ఫెస్ట్. పిల్లలకు వారి ఐడియాలను పంచుకునే అవకాశాలు కల్పించాలి, వారు చేపడుతున్న ప్రాజెక్టులు అందరికీ చూపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఇక్కడితో ఆగకూడదు. నేను ఈరోజు చూసిన ఐడియాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈశ్వర్, లక్ష్మీశరణ్య తయారుచేసిన అటమిక్ సర్వీసెస్ ఫైర్ డిటెక్షన్ చూశాను. తొలుత చేయలేకపోయి బాధపడ్డారు. తర్వాతి ప్రయత్నంలో డిమానిస్ట్రేషన్ చేశారు. వారిని నేను అభినందిస్తున్నా. దాదాపు 1256 ప్రాజెక్టులు చూపించారు, 249 టాప్ ప్రాజెక్టులు స్టేట్ లెవల్‌కు తెచ్చారు. అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నేను కూడా స్కూలింగ్ సమయంలో కారు తయారు చేశా. మీ ప్రాజెక్టులు చూశాక నేను తయారు చేసింది చాలా చిన్నదని తేలిపోయింది. ఒక పక్క కేంద్రం సహకారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాలను ఆవిష్కరించారని మంత్రి లోకేష్ ప్రశంసించారు.
ఇదొక ఈవెంట్ కాదు…. మూమెంట్
ఈ సందర్భంగా కొన్ని విజయగాథలను మీ దృష్టికి తెస్తున్నా. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఆలోచనలను అమలుచేసేందుకు బోర్డు ఒప్పుకోకపోతే కంపెనీని వదిలి వెళ్లారు. ఆ తర్వాత బోర్డు ఆహ్వానం మేరకు మళ్లీ వచ్చి ప్రపంచంలో మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా తయారు చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవంతో ఆయన అధైర్య పడలేదు. 2007లో ఐఫోన్ ప్రవేశపెట్టినపుడు 600 డాలర్ల ఫోన్ ఎవరు కొంటారని అనుకున్నా. ఆ తర్వాత అది సమాజంలో ఎంత ప్రభావం చూపిందో మీకు తెలుసు. మరొక ప్రముఖ వ్యక్తిని కూడా ప్రసావిస్తున్నా. అతని పేరు శ్రీధర్ వెంబు. జోహో కంపెనీని భారత ప్రీమియర్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ కంపెనీగా తయారుచేశారు. గ్రామాల్లో కూడా అద్భుతమైన పిల్లలు ఉన్నారు. ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ తిరుపతి సమీపంలోని నా గ్రామంలో ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇప్పుడు అది మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్ కంపెనీ.
ఎంతోమంది స్ఫూర్తివంతమైన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మన కోసం, సమాజం కోసం అధునాతన ఆవిష్కరణలు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రోజు భారతదేశంలో అతిపెద్ద విండ్ మిల్ కంపెనీ అయిన సుజ్లాన్ అనే సంస్థతోతో సెంటర్ ఆప్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసమే కాకుండా కరిక్యులమ్‌తో పాటు ఇన్నొవేషన్ ప్రాజెక్టు ఇంక్యుబేషన్ చేసే ఆలోచనతో ఒప్పందం కుదుర్చుకున్నాం. భారతదేశంలో ఉన్న మేకిన్ ఇండియా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఇన్నొవేటివ్ ఐడియాలను ఇంక్యుబేట్ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫెస్ట్ ఒక ఈవెంట్ కాదు… ఇదొక మూమెంట్. ప్రధాని మోదీ మేక్ ఇండియా అని పదేపదే చెబుతున్నారు. సెల్‌ఫోన్‌లు, టీవీలు అన్ని కూడా చైనా, తైవాన్‌లో తయారుచేస్తారు. దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. మనమే వాటిని తయారుచేసే స్థాయికి ఎదగాలని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.
ఇంక్యుబేషన్, ఇన్నొవేషన్‌కు ప్రోత్సాహం
ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది మా విధానం. ఇందుకు అవసరమైన ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. వెనుకబడిన జిల్లా అనంతపురానికి కియా కంపెనీ తెచ్చాం. అక్కడ ఉన్న పాలిటెక్నిక్, ఐటిఐల్లో ఆటోమోటివ్ మొబిలిటీ ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయమై ఆలోచిస్తున్నాం. కర్నూలును డ్రోన్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. డ్రోన్స్ ఇన్నొవేషన్‌కి కావాల్సిన మెంటారింగ్‌ను అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది. కడప, చిత్తూరుల్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. టీవీలు, సెల్ ఫోన్‌లు, కెమెరా మాడ్యూల్‌లు తయారుచేసే సంస్థలు అక్కడ వచ్చాయి. ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ పరిశ్రమల ఏర్పాటుకు రిలయన్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ఒక్కొక జిల్లాకు ఒక్కొక ప్రాధాన్యతతో ఎకో సిస్టమ్ ఏర్పాటుచేస్తున్నాం. అందుకు అవసరమైన ఇంక్యుబేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
రతన్ టాటా గురించి నేను ఏం చెప్పినా తక్కువే. ఒకరోజు క్రితమే ఉండి నియోజకవర్గంలో రతన్ టాటా విగ్రహం ఆవిష్కరించా. రతన్ టాటా పేరుతో ఒక ఇన్నొవేషన్ హబ్ ఏర్పాటుచేసి, అందుకు అనుబంధంగా నోడ్‌లు ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. మీలాంటి సృజనాత్మక ఐడియాలు ఉన్నవారిని ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. సృజనాత్మకమైన ఐడియాలతో ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించాలని జీఏడీకి ఆదేశాలు ఇచ్చాం. అందుకు అవసరమైన ఎకనమిక్ యాక్టివిటీ ఎలా క్రియేట్ చేయాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తాం. ఈరోజు ఇక్కడ ప్రతిభ కనబర్చిన వారికి క్యాష్ అవార్డులను ప్రభుత్వం అందిస్తుంది. విద్యార్థుల వద్ద ఉన్న ఐడియాలకు కార్యరూపమిచ్చే వరకు వదిలిపెట్టొద్దని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
అపజయం విజయానికి తొలిమెట్టు
అపజయం విజయానికి తొలిమెట్టు లాంటిది. అందుకు నేనే ఉదాహరణ. 2019లో నేను పోటీచేయాలని ఆసక్తి చూపిస్తే ఎక్కడ నుంచి పోటీచేస్తావని చంద్రబాబు అడిగారు. ఎప్పుడూ గెలవని నియోజకవర్గం మంగళగిరి అడిగాను. అక్కడ 1985 తర్వాత టీడీపీ గెలవలేదు. 2019లో తొలి ప్రయత్నంలో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయా. తొలుత బాధపడినా నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. అయిదేళ్లు కష్టపడి పనిచేశా. ఇటీవల ఎన్నికల్లో ఏపీ చరిత్రలో టాప్ -3 మెజారిటీ 91వేల మెజారిటీతో గెలిచా. ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రి.. మీరు ఏ శాఖ ఆశిస్తున్నారని అడిగితే విద్యాశాఖ కావాలని అడిగా. కష్టమైన, సమస్యాత్మక శాఖ అన్నారు. అందుకే ఆ శాఖ కావాలని అడిగా. ఆ శాఖలో సంస్కరణలు అమలుచేయడం చాలా కష్టమని చెప్పారు. అందుకే నేను ఛాలెంజ్ గా తీసుకొని పనిచేస్తున్నా. సవాళ్లను స్వీకరించినపుడే మీలోని ప్రతిభ బయటకు వస్తుంది. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం లేదు. మీరు చేసే ప్రయాణంలో పది దెబ్బలైనా తగలొచ్చు. పట్టువదలకుండా పోరాడి అనుకున్నది సాధించాలి.
అద్భుతమైన ఐడియాలను ఆవిష్కరించిన పాలిటెక్నిక్ విద్యార్థులను అభినందిస్తున్నా. అధునాతన ఆవిష్కరణలకు మద్దతు ఇస్తాం. రాష్ట్రంలో 8వేల కోట్ల విలువైన స్టార్టప్ కంపెనీ రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో రావాలని నేను కోరుకుంటున్నా. 1995 ` 2004 నడుమ చంద్రబాబు సీఎంగా పనిచేసినపుడు డేర్ టు డ్రీమ్.. స్ట్రైవ్ టు ఎచీవ్ అని చెప్పారు. ఆయన మాటలను స్పూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని విద్యార్థులకు మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.