- అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం
- డిసెంబరు 26, 27 తేదీల్లో ఉత్సవాలు
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి
- సాస్కి కింద పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన
- వివిధ పర్యాటక ప్రాజెక్టులకు రూ.500 కోట్ల ఒప్పందాలు
- గండికోటలో ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్‌కు హాజరైన సీఎం
కడపజిల్లా/ గండికోట (చైతన్య రథం): పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం గండికోట వద్ద ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్‌కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన గండికోట ప్రాంతం భారత్ గ్రాండ్ కాన్యన్‌గా పేరొందిందన్నారు. దీంతోపాటు 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించి, తర్వాత విజయనగర రాజులు పాలించిన ఈ ప్రాంతం చారిత్రక సంపదకు ప్రతిరూపమని స్పష్టం చేశారు. గండికోట ప్రాంతాన్ని సాస్కీ కింద రూ.78 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అద్భుతమైన పర్యాటక కేంద్రంగా గండికోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే పర్యాటకులు బసచేసేలా స్టార్ హోటళ్ల నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పర్యాటక ప్రాంతాల్లో 50 వేల హోటల్ గదుల నిర్మాణం చేసేలా కార్యాచరణ చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. టూరిస్టులను ఆకర్షించేలా గండికోట వద్ద వ్యూపాయింట్‌తో పాటు, ఎకో ఫ్రెండ్లీ టెంట్ సిటీ, బోటింగ్‌తో పాటు కోటవద్ద లైటింగ్ తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు సందర్శించినవారికి మంచి అనుభూతి కలిగేలా రోప్‌వే, గ్లాస్ బాటమ్ వాక్‌వే, లైట్ అండ్ సౌండ్ షోలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది చివరికల్లా టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రాండ్ కాన్యన్‌ను ఆకాశం నుంచి వీక్షించేందుకు హెలిరైడ్స్ కూడా సెప్టెంబరు నుంచి మొదలవుతాయన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు కారావాన్ టూరిజం సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
రూ.500 కోట్ల విలువైన పర్యాటక ప్రాజెక్టులకు ఒప్పందాలు
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉద్దేశించిన ఒప్పందాలు ముఖ్యమంత్రి సమక్షంలో జరిగాయి. ఈజ్ మై ట్రిప్, హిల్టన్ హోటల్స్ సహా వివిధ సంస్థలు ఏపీ టూరిజం కార్పొరేషన్‌తో రూ.500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి. గండికోటతోపాటు శ్రీశైలం, మంత్రాలయం, తిరుపతి తదితర ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణం, అడ్వెంచర్ స్పోర్ట్స్, హై రోప్, కయాకింగ్, జెట్ స్కీయింగ్‌లాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఒప్పందాలు కుదిరాయి. కేంద్రప్రభుత్వ పథకాలైన సాస్కి, స్వదేశ్ దర్శన్ పథకాల కింద గండికొట, బొర్రా గుహలు, అహోబిలం, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో వివిధ టూరిజం ప్రాజెక్టులను సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఏపీలో అమలు చేస్తున్న టూరిజం పాలసీలో భాగంగా పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పిస్తున్నామని అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం, అడ్వెంచర్, క్రూయిజ్, వెల్‌నెస్, కారావాన్, గోల్ఫ్, హెరిటేజ్, టెంపుల్ టూరిజం ప్రాజెక్టులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖ, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోటలను 7 యాంకర్ హబ్‌లుగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. అలాగే 25 థీమాటిక్ సర్క్యుట్‌లను కూడా ప్రకటించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టేలను కూడా ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో 8 పర్యాటక ఈవెంట్లను నిర్వహించటంతోపాటు జిల్లాల వారీగానూ కార్యక్రమాలు, టూరిజం ఫెస్టివల్స్ నిర్వహిస్తామన్నారు. అంతకుముందు గండికోట గ్రాండ్ కాన్యన్ సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడే ఉన్న టూరిస్ట్ గైడ్, పర్యాటకులతో కొద్దిసేపు ముచ్చటించారు.