- రాష్ట్రాభివృద్ధికి కంకణబద్దులై ఉండాలి
- ప్రాజెక్టులపై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు
- మన ఎంపీల పనితీరు బావుంది..
- ప్రజలతో మరింత మమేకమవ్వాలి..
- క్రిమినల్స్ రాజకీయాలపట్ల జాగ్రత్త
- టీడీపీ భేటీలో సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం
- పార్లమెంట్‌కు హాజరు, చర్చల్లో పాల్గొనడంపై ప్రశంసలు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి నారా లోకేష్, ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… ‘పార్లమెంట్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు మద్ధతు ధర, నదీ జలాలు, పారిశ్రామికీకరణ వంటి అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలి. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వివరించడంతోపాటు కేంద్రం నుంచి ఆశిస్తున్న సాయాన్ని పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
మన ఎంపీల పనితీరు బాగుంది
‘పార్లమెంట్‌లో మన ఎంపీల పనితీరు బాగుంది. క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరవుతున్నారు. చర్చించే అంశాలపై రాష్ట్ర వాదనను సమర్థవంతంగా వినిపిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుల హాజరులో దేశవ్యాప్తంగా సగటున 85శాతం ఉండగా టీడీపీ సభ్యులది 86.2 శాతం హాజరుతో అగ్రస్థానంలో ఉన్నారు. చర్చల్లో పాల్గొనడం, ప్రశ్నలు అడగటంలోనూ తెలుగుదేశం ఎంపీలు తొలిస్థానంలో ఉన్నారు. పార్లమెంట్‌లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంతోపాటు ప్రధాని మోదీ చేస్తున్న మంచి పనులను కూడా సభలో ప్రస్తావించాలి. సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో టెర్రరిస్టులకు గట్టి సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్, ఎమర్జెన్సీకి 50 ఏళ్లువంటి అంశాలపై జరిగే చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును సమర్థించాలి’ అని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు.
రాష్ట్ర సమస్యలపై నిరంతరం సంప్రదింపుల జరపాలి
‘ఎంపీలకు కొన్ని శాఖల వారీగా బాధ్యతలు అప్పజెప్పాం. మీకు కేటాయించిన విభాగాలకు సంబంధించిన సమస్యలు, పెండిరగ్ అంశాలపై కేంద్రమంత్రులతో నిరంతరం మాట్లాడాలి. రాష్ట్ర యంత్రాంగంతోనూ సమన్వయం చేసుకోవాలి. నిరంతరం సంప్రదింపులు జరపడం వల్లే నరేగాకు సంబంధించి రూ.180 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ బిల్లులను తిరిగి ప్రక్రియలో పెట్టగలిగాం. ఇదేవిధంగా జల్ జీవన్ మిషన్, ఆరోగ్య మిషన్‌వంటి పథకాలపైనా దృష్టిపెట్టి అదనపు నిధుల సాధనకు కృషి చేయాలి. అలాగే ప్రతి అంశంపై ఎంపీలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి, సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. జరిగే రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు దృష్టిపెట్టాలి. నేను కచ్చితమైన సమాచారంతో ఉండబట్టే ఢల్లీిలో జరిగిన తెలుగురాష్ట్రాల సీఎంల సమావేశంలో రాష్ట్రానికి మేలు కలిగేలా వాదనలు వినిపించగలిగాను’ అని మార్గనిర్దేశనం చేశారు.
ప్రజలతో మరింత మమేకమవ్వండి
‘రాష్ట్రం సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రజలు మనకు ఓట్లు వేసి అధికారమిచ్చారు. పెద్ద సంఖ్యలో ఎంపీలను ఇచ్చారు. దీన్ని మనం రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకోవాలి. ఎంపీలు ప్రజలతో మమేకమై పనిచేయాలి. అనవసర విషయాల్లో ఎంపీలు ఎక్కడా జోక్యం చేసుకోవద్దు. వన్ టైం ఎంపీలుగా ఉండేలా ప్రవర్తించవద్దు. ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షల మేరకు మీరు పని చేయాలి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన రాష్ట్రానికి ప్రధాని మోదీ మూడుసార్లు రాష్ట్రానికి వచ్చారు. యోగాంధ్రవంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు. వీటిని మనం విజయవంతం చేశాం. జాతీయస్థాయిలో రాష్ట్ర ఇమేజ్ పెరిగింది. దీన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. మామిడి రైతులకు కేంద్రంనుంచి అందాల్సిన సాయం వచ్చేలా చూడాలి. పల్ప్ పరిశ్రమలకు జీఎస్టీ తగ్గించే అంశంపైనా సంప్రదింపులు జరపాలి. ఇటీవల ఏపీలో జరిగిన పరిణామాలను వివరించాలి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. సమయానుకూలంగా వ్యవహరించి సభలో క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, జనాభా నిర్వహణ, పీ`4 వంటి అంశాలను వివరించేందుకు ప్రాధాన్యతనివ్వాలి. ఇదే సమయంలో నేరపూరిత రాజకీయ అంశాల ప్రస్తావన వచ్చినప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలి’ అని అన్నారు.
క్రిమినల్స్‌తో రాజకీయం చేయాల్సివస్తోంది
ఎంపీలతో సమావేశం సందర్భంగా సీఎం చంద్రబాబు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను ప్రస్తావించారు. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందనేది జగన్ ప్రవర్తనతో అర్థమవుతోందని చెప్పారు. ‘జగన్ కారుకింద పడి తన భర్త చనిపోయాడని సింగయ్య భార్య ఫిర్యాదు చేస్తే… ఆ కేసులో నిందితుడిగా ఉన్న జగన్ సింగయ్య కుటుంబాన్ని పరామర్శ పేరుతో తన ఇంటికి పిలిపించుకుని ‘లోకేష్ తనకు కోటి రూపాయలు ఇస్తానని ఆశచూపారు… అందుకే కేసు పెట్టాను’ అని బెదిరించి మరీ ఆమెతో చెప్పించారు. వివేకా హత్య సమయంలోనూ ఇదే తరహా డ్రామా ఆడారు. వివేకా చనిపోయారని నేను బాధపడితే నాపైనే ఆరోపణలు చేశారు. నారాసుర రక్తచరిత్ర అంటూ కథనాలు రాశారు. సీఎంగా ఉన్న నాపైనే హత్యారోపణలు చేసే ధైర్యం చేశారంటే ఎంత బరితెగించినవాళ్లో అర్థం చేసుకోవాలి. మన దురదృష్టంకొద్దీ అలాంటి వాళ్లతో రాజకీయం చేయాల్సి వస్తోంది. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎంపీలుగా మీరూ అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యం చేయాలి’ అని సీఎం ఎంపీల సమావేశంలో అన్నారు. ఢల్లీిలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశ అంశాలను ఎంపీలకు ముఖ్యమంత్రి వివరించారు.