అమరావతి (చైతన్యరథం): వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసంతో తిరోగమనంలోకి పోయిన ఆంధ్రప్రదేనశను తిరిగి సాధారణ స్థాయికి తీసుకొచ్చే విధంగా 2024-25 బడ్జెట్ ఉందని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత లభించిందన్నారు. రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్లో ప్రతి రంగానికి కేటాయింపులు చేశారన్నారు. రాష్ట్ర జీఎస్టీపీలో 40 శాతానికి పైగా వాటా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.43,402 కోట్లు కేటాయించడం ద్వారా రైతు సంక్షేమ ప్రభుత్వం అన్న పేరుకు సార్ధకత లభించిందన్నారు. విద్య, వైద్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధితో పాటు రాష్ట్ర రహదారుల కోసం సింహభాగం ఖర్చు చేయాలని భావించడం ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని, వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మొహం చాటేశారు. రాష్ట్ర ప్రజలకు ఎంతో కీలకమైన బడ్జెట్ సమావేశాలకు కూడా రాకుండా తమ బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖకు బడ్జెట్లో రూ. 8,495 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ పాలనలో అరకొర సౌకర్యాలతో పోలీసులు ఎన్నో కష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపట్టింది. పోలీసు శాఖలో ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన కోసం ఇప్పటికే రూ.62 కోట్లు విడుదల చేశాం. శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరంలో కొత్తగా 4 స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని పట్టిపీడిరచిన మాదకద్రవ్యాలను రాష్ట్రంలో లేకుండా చేసేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నాం. దీని కోసం యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశాం. విద్యార్థులు మత్తుకు బానిసలు కాకుండా ఉంచేందుకు ఉన్నత విద్యాసంస్థల్లో 3,172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అనిత పేర్కొన్నారు.