- ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
- కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలని వినతి
- పోలవరం, అమరావతికి సాయంపై ధన్యవాదాలు
- స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ అందజేత
- జనవరిలో ప్రధాని రాష్ట్ర పర్యటనపైనా చర్చ
డిల్లీ: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ప్రధాని మోదీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, రాజధాని పనులు తదితర అంశాలను వివరించిన ఆయన పనులు వేగంగా సాగేందుకు ప్రత్యేక సాయం అందిం చాలని కోరారు. 45 నిమిషాల పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ఆర్థిక అంశాలు, సమస్యలు వంటి అంశాలపై చర్చించారు. పోలవరం, అమరావతి పనులు మళ్లీ ప్రారంభించిన విషయాన్ని మోదీకి వివరించారు. పనులు వేగంగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏపీకి కీలకమైన రెండు ప్రాజెక్టులు గాడిన పెట్టడానికి ఆర్థిక సాయం చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 94 కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం నిధులు దారి మళ్లించిన విషయాన్ని…దానివల్ల జరిగిన నష్టాన్ని వివరించారు. వీటిలో 74 పథకాలను తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని ప్రధానికి వివరించిన చంద్రబాబు ఆ ప్రాజెక్టుకు అవసరమైన ముడి ఖనిజం సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. దీంతో పాటు ఈ సంస్థ ఏర్పాటుకు వివిధ శాఖలకు సంబంధించి అనుమతులు త్వరితగతిన వచ్చేలా చూడాలని విన్నవించారు. సాంకేతిక ఇబ్బందులు తొలగితే ప్రాజెక్టు వేగంగా పట్టాలు ఎక్కుతుందని అందుకు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని వివరిస్తూ ఐదేళ్లకు రావాల్సిన రెవెన్యూ డెఫిషిట్ గ్రాంట్‌ను మూడేళ్ల లోనే వాడేసిందని తెలిపారు. స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు.
స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి సాయమందించాలి
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రధానికి అందజేశారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా తమ వంతుగా రాష్ట్రం నిర్ధేశించుకున్న లక్ష్యాలను, వాటిని చేరుకునేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలను వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సాయం అందించా లని కోరారు. వచ్చే నెలలో ప్రధాని చేతులమీదుగా రాష్ట్రంలో భారీగా తలపెట్టిన శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపే ప్రాజెక్టులపై చర్చించారు. అంతకు ముందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతిలో పాల్గొని నివాళులర్పించారు. అనంత రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీయే పక్షాల సమావే శంలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ఉక్కు మంత్రి కుమార స్వామిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేసే విషయంపై చర్చించారు. ఆ తర్వాత కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌తో భేటీ అయ్యారు.
విశాఖ రైల్వేజోన్ పనుల శంకుస్థాపన, రాష్ట్రంలో చేప ట్టిన..చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసే అంశంపై చర్చించారు. అమరావతికి కొత్త రైల్వేలైన్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనం తరం కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర అర్థిక పరిస్థితులు, వాటిని గాడిన పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర నిధుల విడుదల తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సాయం చేయాలని కేంద్ర మంత్రులను కోరారు. ఈ భేటీల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.