- కేంద్రానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ భరోసా
- క్షయ నిర్మూలనకు 100 రోజుల విస్తృత ప్రచారం
- రాష్ట్రంలో విజయనగరం జిల్లా ఎంపిక
అమరావతి (చైతన్యరథం): భారతదేశాన్ని క్షయరహిత దేశంగా మార్చే లక్ష్యాన్ని చేరేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రారంభించిన ‘‘ని-క్షయ్ శివిర్: 100 డేస్ ఇంటెన్సివ్ క్యాంపెయిన్’’ విజయవంతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాకు హామీ ఇచ్చారు. నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్‌టీఈపీ) కింద, ‘‘ని-క్షయ్ శివిర్: 100 డేస్ ఇంటెన్సివ్ క్యాంపెయిన్’’ను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 347 జిల్లాల్లో ప్రారంభించింది. మన రాష్ట్రంలో విజయనగరం జిల్లాను ఈ ప్రచారం కోసం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సత్యకుమార్ యాదవ్‌తో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 25.52 లక్షల మంది టీబీ రోగులు ఉన్నారని, ప్రతి లక్ష మందికి 179 బాధితులు ఉన్నారని వెల్లడిరచారు. విజయనగరం జిల్లాలో ‘‘ని-క్షయ్ శివిర్: 100 డేస్ ఇంటెన్సివ్ క్యాంపెయిన్’’ను విజయవంతం చేయాలని మంత్రిని కోరారు. కేంద్ర మంత్రి విజ్ఞప్తిపై సత్యకుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రాన్ని క్షయ రహితంగా మార్చేందుకు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో 76,590 మంది టీబీ బాధితులు ఉన్నారని చెప్పిన మంత్రి, క్షయ వ్యాధి, మరణాల రేటును గణనీయంగా తగ్గించేందుకు శక్తి వంచన లేకుండా పని చేద్దామని అన్నారు. ‘‘ని-క్షయ్ శివిర్: 100 డేస్ ఇంటెన్సివ్ క్యాంపెయిన్’’ విజయవంతానికి పూర్తి స్థాయిలో సహకరించాలని అధికారులకు సూచించారు.
‘‘ని-క్షయ్ శివిర్: 100 డేస్ ఇంటెన్సివ్ క్యాంపెయిన్’’లో భాగంగా, వైద్య, ఆరోగ్య శాఖ విజయనగరం జిల్లాలో పెద్ద సంఖ్యలో శిబిరాలు, విస్తృతంగా అవగాహన ప్రచారాలు నిర్వహిస్తుంది. క్షయ సోకేందుకు ఆస్కారం ఉన్నవారితో పాటు సాధారణ ప్రజలకు కూడా పరీక్షలు చేసి టీబీ కేసులు గుర్తిస్తుంది. మధుమేహం ఉండి 60 సంవత్సరాలు పైబడినవారికి, హెచ్‌ఐవీ రోగులకు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారికి, గతంలో టీబీ నిర్ధ్ధారణ అయినవారికి, వారి సన్నిహిత కుటుంబ సభ్యులకు, బీఎంఐ 18 కంటే తక్కువ ఉన్నవారికి టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. వైద్య శిబిరాలు, ప్రచార కార్యక్రమాల నిర్వహణతో పాటు క్షయ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రత్యేకంగా ‘‘ని-క్షయ్ వాహన్’’లు ఏర్పాటు చేశారు. అక్కడిక్కడే ఛాతీ ఎక్స్‌రే తీయడానికి ‘‘ని-క్షయ్ వాహన్’’లో పోర్టబుల్ ఎక్స్‌రే మెషీన్ ఉంటుంది. నాట్ టెస్టింగ్ కోసం కూడా ‘‘ని-క్షయ్ వాహన్’’లో ఏర్పాట్లు ఉంటాయి. ‘‘ని-క్షయ్ శివిర్’’ విజయవంతానికి అన్ని ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు, పౌర సంఘాలు, ప్రైవేట్ ఆసుపత్రులు సహకరిస్తాయి, భాగస్వామ్యం తీసుకుంటాయి.