.వాషింగ్టన్ డీసీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి
.గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృతోత్సవాలు
వాషింగ్టన్ డీసీ: ఎన్నో పోరాటాలు, మరెన్నో బలిదానాల తర్వాత భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి చెప్పారు. వాషింగ్టన్ డీసీలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన భారత 75వ స్వాంతంత్య్ర దినోత్సవాలలో ఆయన మాట్లాడారు. తొలుత భారత జాతీయ జెండాను ఎగరవేశారు. జెండాలను చేతబూని ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బుచ్చియ్య చౌదరి మాట్లాడుతూ ఇక్కడ ఆజాదీ కా అమృతోత్సవాలలో పాల్గొనడం మరపురానిదని చెప్పారు. అమెరికాలో ప్రవాసాంధ్రులు పెద్దసంఖ్యలో ఉన్నారని, వీరంతా భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చేందుకు తమవంతు కృషిచేస్తున్నారన్నారు. భారతీయులందరూ ఎక్కడ ఉన్నా ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా, పండుగలాగా జరుపుకుంటారని జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు సాయి సుధ పాలడుగు అన్నారు. అమెరికాలో తొలుత ఏర్పాటుచేసిన తెలుగు సంఘం జీడబ్ల్యూటీసీఎస్ అని తెలిపారు. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థకు తాను అధ్యక్షురాలు కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కరోనా లాంటి మహమ్మారిని సైతం లెక్కచేయకుండా తమ పాలకమండలి అనేక సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేపట్లు వివరించారు. స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించడం పట్ల తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న తెలుగువారు అందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేసిన పాలకమండలిని అభినందించారు.స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా తెలుగుదనం ఉట్టిపడేలా జాతి గౌరవాన్ని పెంపొందిస్తున్నందుకు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుభాష తియ్యదనాన్ని, తెలుగుజాతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించారు. అనంతరం క్రీడల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. భాను మాగులూరి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎంబసీ కౌన్సెలర్ అన్షుల్ శర్మ, సత్యనారాయణ మన్నె, చంద్ర మల్లావతు, కృష్ణ లాం, రవి అడుసుమిల్లి, రాజేష్ కాసరనేని, ఫణి తాళ్లూరు, శ్రీనివాస్ గంగా, యాష్ బద్దులూరి, సుశాంత్ మన్నె, సుష్మ అమృతలూరు తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.