- బస్సులో ప్రయాణించి వివరాల సేకరణ
బెంగళూరు: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించింది. ఏపీలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ అంశంపై అధ్యయనానికి సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అధ్యయనం నిమిత్తం ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కర్ణాటక పర్యటనకు వెళ్లింది. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన ఏపీ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హోంమంత్రి అనిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే.. కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అంతకు ముందు కర్ణాటక మంత్రి రామలింగారెడ్డిని, ఆ రాష్ట్ర అధికారులను కలిశారు. వారితో సమావేశమై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుపై చర్చించారు. కర్ణాటక పర్యటన సందర్భంగా ఏపీ మంత్రులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఉచిత ప్రయాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం అమలు చేయడం వల్ల అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం, లబ్ధి గురించి కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించనున్నారు.