- గత ప్రభుత్వంలో రూ.18.96 కోట్ల బకాయిలను ప్రజా ప్రభుత్వం చెల్లించింది
- హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తాం
- శాసనమండలిలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో 7నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్లను పంపిణీ చేస్తున్నట్టు విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలోని విద్యార్థులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్లను అందించడంపై శాసనమండలిలో సభ్యులు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 7వ తరగతినుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్లను సరఫరా చేస్తున్నామన్నారు. గతంలో ఏడు రెగ్యులర్ సైజ్, మూడు లార్జ్ సైజ్ న్యాప్కిన్లు ఇచ్చేవారు. ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత 5 రెగ్యులర్ సైజ్, 5 లార్జ్ సైజ్ శానిటరీ ప్యాడ్‌ను ప్రభుత్వం అందజేస్తోంది. గత ప్రభుత్వంలో 18.96 కోట్ల బకాయిలు పెట్టారు. ప్రజా ప్రభుత్వం ఆ బకాయిలను తీర్చడం జరిగింది. ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆరఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతోంది. 96శాతం బాలిలకు తమకు శానిటరీ న్యాప్ కిన్లు అందుతున్నాయని, 4 శాతంమంది అందడం లేదని చెప్పారు. నాణ్యత విషయంలో 1 శాతం బాగాలేదని, 14 శాతం ఫర్వాలేదు, బాగుందని 85శాతంమంది చెప్పారు. శానిటరీ న్యాప్కిన్స్ ఎబ్సార్ప్షన్పై 84శాతంమంది బాగుందని, 14 శాతంమంది పర్వాలేదని, బాగాలేదని 2శాతం మంది ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. సైజ్ విషయంలో 89శాతం మంది బాగుందని, 11శాతం బాగాలేదని చెప్పారు.
ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ పంపిణీపైనా చర్చించడం జరిగింది. దీనిపైనా పరిశీలన చేస్తాం. ఎన్జీవోలతో మాట్లాడి బాలికల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. వెండింగ్ మిషన్స్ విత్ స్మార్ట్ కార్డ్‌ను ఇప్పటికే కేజీబీవీల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. అన్ని పాఠశాలలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటాం. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదో క్యాంపెయిన్‌లా చేస్తాం. దీనిపై అనేక అపోహలున్నాయి. ఇది అవసరం. అందరం కలిసికట్టుగా దీనిపై అవగాహన తీసుకురావాల్సిన అవసరముందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అంతముందు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడుతూ.. విద్యార్థినులకు నెలసరి వచ్చే సమయంలో సరైన హైజీన్ ప్రొడక్ట్స్ అందక పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదవుతున్న బాలికలకు ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ కచ్చితంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.













