- ప్రథానికి థాంక్స్ చెబుతూ ముఖ్యమంత్రి ట్వీట్
- నాణ్యమైన విద్యకు 4కేవీఎస్లు వరం: లోకేశ్
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ కు నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలు ప్రకటించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ.. ఏపీలో నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాల స్థాపనకు ఆమోదం తెలిపింది.
మంగసముద్రం (చిత్తూరు), బైరుగనిపల్లె (కుప్పం మండలం, చిత్తూరు), పలాస (శ్రీకాకుళం), శాఖమూరు (అమరావతి) ప్రాంతాల్లో కేవీఎస్ల స్థాపనకు కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు సీఎం చంద్రబాబునాయుడు ఎక్స్లో పోస్టు పెడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు హృదయపూర్వక కృతజ్ఞతలు, ఈ చొరవ మన రాష్ట్రంలో గతంలో సేవలు అందని ప్రాంతాలలో నాణ్యమైన విద్యను పొందే అవకాశాన్ని గణనీయంగా పెంచుతుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గణనీయంగా ఉన్న ప్రాంతాల పెరుగుతున్న అవసరాలను కూడా తీరుస్తుంది. ధన్యవాదాలు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
నాణ్యమైన విద్యకు ఇది వరం: లోకేశ్
సంస్కరణలతో నాణ్యమైన విద్య అందించేందుకు వేగంగా అడుగులేస్తున్న ఆంధ్రప్రదేశ్కు -నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించడం గొప్ప వరమని విద్యా మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. “కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పడానికి సంతోషిస్తున్నా. ఏపీలో నాణ్యమైన విద్యను పెంపొందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.