తాడేపల్లి (చైతన్యరథం): మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ గంగా, శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వేరస్వామివార్ల ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో శుక్రవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు.. గ్రామస్థులు, ఆలయ పునఃనిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులు బాణసంచా కాల్చి ఘనస్వాగతం పలికారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ పునఃనిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి శ్రీ గంగా, శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వార్ల ఆలయ పునర్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ధాన్యాదివాసంలోని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిలఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.












