టిడిపి అధికారంలోకి రాగానే ఇంటర్ చదివే విద్యార్థుల సంఖ్యను బట్టి జూనియర్ కళాశాల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం జమ్మలమడుగు నియోకవర్గం పెద్దపసుపుల జంక్షన్ లో పెద్దముడియం గ్రామరైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామం నుండి సుద్దపల్లెకు, పొలాలకు వెళ్లే రహదారిలో సీసీ రోడ్డు నిర్మించాలి. జంగాలపల్లె వెళ్లే రహదారి వద్దనున్న వంకపై బ్రిడ్జి కుందూనది వరద వస్తే మునిగిపోతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కుందూనది వరద వల్ల మా భూములు కోతకు గురవుతున్నాయి. రాజోలి ప్రాజెక్టు నిర్మించి మా భూములకు నష్టపరిహారం ఇప్పించాలి. పెద్దముడియం గ్రామంలో జూనియర్ కాలేజీ, కళ్యాణమండపం నిర్మించాలి. మా గ్రామ ముస్లిములకు షాదీఖానా ఏర్పాటు చేయాలి అని వారు విజ్ఞప్తిచేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. గ్రామాలకు నిధులివ్వకపోగా, గ్రామపంచాయితీల్లోని రూ.8,660 కోట్లను సర్పంచ్ లకు తెలియకుండా దొంగిలించారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో 25వేల కి.మీ సిసి రోడ్లు, 30లక్షల ఎల్ఇడి లైట్లు వేశాం. మౌలిక సదుపాయాలు కల్పనలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మేం అధికారంలోకి వచ్చాక సుద్దపల్లెకు, పొలాలకు వెళ్లే పుంతరోడ్డును నిర్మిస్తాం. కుందూనది ముంపు సమస్యను పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. రాజోలి ప్రాజెక్టును 2.95 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించి, ఆమేరకు నిర్వాసితులందరికీ పరిహారం ఇస్తాం. పెద్దముడియంలో కళ్యాణ మండపం, మైనారిటీలకు షాదీఖానా నిర్మిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.