- ఎప్పటికీ రైతు గెలుపే నా గెలుపు
- సీఎం సంకల్పం అర్థం చేసుకుని ముందుకెళ్తా
- అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి స్పష్టీకరణ
- వ్యవసాయంపై సీఎం చంద్రబాబుది ప్రత్యేక శ్రద్ధ
- అప్సంకు మర్రెడ్డి సేవలు అవసరం: మంత్రి నిమ్మల
- రైతు కోసం మర్రెడ్డి పోరాటం వృధాకాలేదు: సవిత
- మర్రెడ్డి సేవలు మరింత విస్తృతం: కొల్లు రవీంద్ర
- సీఎం చంద్రబాబు విజనరీ నిర్ణయం: మనోహర్
- అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్‌గా మర్రెడ్డి బాధ్యతల స్వీకారం
- అట్టహాసంగా సాగిన బాధ్యతల స్వీకార కార్యక్రమం
అమరావతి, డిసెంబర్ 24: అందరూ కిరీటంలా భావిస్తున్న అగ్రి మిషన్ చైర్మన్ పదవి ముళ్ల కిరీటంలాంటిదని, ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో తనకు తెలుసునని మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సత్సంకల్పాన్ని నెరవేర్చడానికి, రైతు శ్రేయస్సు సాధనకు ఎలాంటి సమస్యలను అధిగమించడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వ్యవసాయ పురోగతిలో నావంతు బాధ్యత నిర్వర్తించి ప్రజామోదం పొందేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం మేరకు అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్‌గా నియమితులైన మర్రెడి శ్రీనివాస రెడ్డి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లి సీఎస్సార్ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ, పార్టీ పెద్దలు, అధికార్లు, రాష్ట్రవ్యాప్తంగా తెలుగు రైతు ప్రతినిధులు, శ్రేణులు పెద్దఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో తొలుత మర్రెడ్డి అప్సం వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ.. ‘ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందుతాననే విశ్వాసం ఉంది. రైతుల గెలుపే నా గెలుపు.
ఏ పరిస్థితుల్లోనైనా సరే రైతులను ఆదుకుంటాను. టీడీపీలో కష్టపడినవారికి ఫలితం దక్కుతుందని నా విషయంలో రూఢీ అయింది. పార్టీ కోసం కష్టపడ్డవాళ్లను చంద్రబాబు విస్మరించరన్న విషయం అనేకమంది విషయంలో రుజువైంది. ఏ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఉద్దేశంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించారో నాకు తెలుసు. ఆ సంకల్పాన్ని నెరవేర్చి రైతుకు మరింత సేవ చేస్తా. రాబోయే రోజుల్లో రైతులకు మరిన్ని సేవలందించేందుకు పదవిని వినియోగిస్తా. రైతును రాజును చేద్దాం. డ్రైవర్ ప్రయాణీకులను క్షేమంగా గమ్యస్థానాన్ని చేరిస్తే ఎంత ఆనందం కలుగుతుందో.. సేవలు చేసి వారిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తే నాకు అంత ఆనందం కలుగుతుంది. మంచి పనులు చేస్తే మరిన్ని అవకాశాలొస్తాయి. డ్రైవర్ సురక్షితంగా ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చనప్పడు.. నీ సేవలు చాలు, దిగిపో అంటారు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోను, ఎవరూ తెచ్చుకోవద్దు’ అని మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. క్రమశిక్షణతో కష్టించి పనిచేసేవారికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పడానికి మర్రెడ్డి శ్రీనివాస రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ (అప్సమ్) వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వడమే ఉదాహరణ అని రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ‘ఐదేళ్లపాటు రైతులపై వైసీపీ నిరంకుశ, నియంతృత్వ పాలన సాగింది. ఆ సమయంలో అవిశ్రాంత పోరాటం చేసిన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డికి అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ పదవి రావడం రైతులందరికి సంతోషదాయకం. రాష్ట్ర విభజనకు ముందు ఐటీ, సైబరాబాద్ ద్వారా అత్యధిక ఆదాయం రాష్ట్రానికి వచ్చేది. రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. నవ్యాంధ్ర అభివృద్ధి జరగాలంటే వ్యవసాయమే అత్యంత కీలకమని చంద్రబాబు గ్రహించారు. వ్యవసాయ సంరక్షణకు సాహసోపేత నిర్ణయాలే తీసుకున్నారు. చంద్రబాబు సారథ్యంలో ఐదేళ్లపాటు రాష్ట్రంలో రైతు పాలన సాగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఐదేళ్లలోనే 72శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత చంద్రబాబుది. ఆ సమయంలో రైతులకు హెక్టారుకు 20 వేల చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు.
తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని 15 వేలకు కుదించింది. రైతుకు ఇన్స్యూరెన్స్ ఆక్సిజన్ లాంటిది. వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇన్స్యూరెన్స్ దగా చేసింది. ఆ సమయంలో చంద్రబాబు అసెంబ్లీలో కిందకూర్చొని నిరసన తెలిపితే.. ఆరోజు రాత్రి 11 గంటలకు వైసీపీ ప్రభుత్వం ఇన్స్యూరెన్స్ కట్టింది. అదీ వైసీపీ హయాంలో రైతులపట్ల సాగిన నిర్లక్ష్యం. వైసీపీ దౌర్భాగ్య పాలనను ఛీకొట్టిన ప్రజలు.. 2024లో కూటమి ప్రభుత్వానికి ఘనవిజయాన్నిచ్చారు. మంచి ప్రభుత్వంలో రైతుకు మంచి రోజులొచ్చాయి. రైతు శ్రేయస్సు, వ్యవసాయ సంక్షేమనికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక పాలసీలనే రూపొందిస్తుండటం చూస్తున్నాం.
చంద్రబాబు నాయకత్వంలో తెలుగు రైతు అధ్యక్షునిగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతం తిరుగుతూ రైతాంగానికి బాసటగా నిలిచారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇన్‌పుట్ సబ్సిడీని 16 వేల నుంచి హెక్టారుకు 25 వేల రూపాయలు చంద్రబాబు పెంచారు. పడకేసిన పోలవరాన్ని 2027 డిసెంబర్‌కల్లా పూర్తిచేసి గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. వ్యవసాయంపై బాగా అవగాహన ఉన్న మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్‌గా నియమించడం రైతులకు పెద్దఎత్తున జరగబోయే మేలుకు సంకేతం. ఆయన అనుభవాన్ని ప్రభుత్వం వాడుకొని రైతులను రక్షించడంలో ముందుకెళ్తుంది. వ్యవసాయాన్ని కాపాడుకుంటాం. రాష్ట్రంలో రైతు పాలన సాగుతోందని నిరూపించుకుంటాం’ అన్నారు.
బీసీ సంక్షేమ మంత్రి సవిత మాట్లాడుతూ.. `రైతుల కోసం శ్రీనివాసరెడ్డి సాగించిన పోరాటాలు చిన్నవేం కాదు. పోలీసులు కేసులు పెడుతున్నా అదరం, బెదరం, చెదరం అంటూ తెలుగుదేశం జెండా ఎత్తిన రైతులు ఎన్ని కష్టాలొచ్చినా దించరని ముందుకు వెళ్లారు. అహర్నిశలు వైసీపీ నిరంకుశ పాలనపై పోరాడారు. అన్న నందమూరి తారక రామారావు రైతాంగానికి ఒక గుర్తింపును తీసుకొచ్చారు. ఆయన స్ఫూర్తితో చంద్రబాబునాయుడు ముందుకు సాగారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కూర్చోవడానికి కుర్చీ లేకున్నా రైతాంగానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం. తాగునీరు, సాగునీరు అందించారు. రైతు బిడ్డలు బాగుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు రైతులకు అందించారు. రైతులకు పెట్టుబడి సాయం అందజేయడం జరిగింది. అలాగే రుణమాఫీ చేశారు. డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు. నాణ్యమైన ఎరువులిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. వాన మబ్బుల కోసం ఎదురుచూస్తూ తట్టా బుట్టా నెత్తిన పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు తరలిపోయే సమయంలో చంద్రబాబు 2014-19లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేసి అపర భగీరధుడయ్యారు. రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. జగన్ ‘ఒక్క ఛాన్స్’ తీసుకుని అన్ని రంగాలను భూస్థాపితం చేశాడు.
నా రైతన్నలు అని ప్రేమ నటిస్తూనే.. 63 శాతం వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్ర రైతాంగాన్ని పాతాళంలోకి తొక్కాడు. కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి 8సార్లు పెంచాడు. మోటార్లకు మీటర్లు బిగించి రైతులకు దగా చేశాడు. అవినీతితో రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్న ఘనుడు జగన్. జగన్ పాలనలో డ్రిప్ ఇరిగేషన్ లేదు. స్పికర్లు లేవు. నాణ్యమైన విత్తనాలు లేవు. వైసీపీ హయాంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చంద్రబాబు వస్తేగాని రాష్ట్రం బాగుపడదని గ్రహించి మూకుమ్మడిగా బడుగు, బలహీన వర్గాలు, విద్యావంతులు అందరూ ఏకమై ఎన్డీయే ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీనిచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం పరుగులు పెడుతోంది. ఇలాంటి సమయంలో వ్యవసాయంపై సంపూర్ణమైన అవగాహనవున్న మర్రెడ్డిని అగ్రి మిషన్ వైస్‌గా నియమించడం గొప్ప విషయం. మర్రెడ్డికి చంద్రబాబు మరింత బాధ్యతలు పెంచారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం మొత్తం పనిచేస్తుంది. రాష్ట్రానికి, రైతుకు మంచి రోజులు వచ్చినట్టే’ అన్నారు.
గనులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఐదేళ్లపాటు రైతుల పక్షాన పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మర్రెడ్డిని అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్‌గా నియమించటంతోనే అర్థం చేసుకోవచ్చన్నారు. అగ్రి మిషన్‌తో వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్‌లాంటి కీలక శాఖలు అనుసంధానమై ఉంటాయని, ఆయా శాఖల సహకారంతో అగ్రి మిషన్ అద్భుత ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం పనులు శరవేగమయ్యాయన్నారు. గ్రామాల్లోని కాలువల మరమ్మతులకై గ్రామ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఏకగ్రీవంగా 100 శాతం కమిటీలు ఏర్పాటు చేసుకున్న ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామన్నారు. మర్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర రైతాంగానికి తప్పక న్యాయం జరుగుతుందని, ఆయన పోరాటాలను గుర్తించి సీఎం చంద్రబాబు సముచిత స్థానం కల్పించారని అభినందించారు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..
‘రైతులు ఎదుర్కొన్న సమస్యలు, మిల్లర్స్‌తో ధాన్యం కొనుగోలు విషయంలో కొత్త సంస్కరణలు తీసుకొద్దామనే ఆలోచనతో మర్రెడ్డి శ్రీనివాసులును కలవగా ఆయన అనేక సూచనలు, సలహాలిచ్చారు. ఆయనకు రైతులపట్ల అభిమానం అధికం. చేసే ప్రతి కార్యక్రమం రైతులకు ఉపయోగపడాలనేది చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఉద్దేశం. అలాగే మర్రెడ్డి ఆలోచన. భవిష్యత్తులో చేపట్టే ప్రతి కార్యక్రమం రైతులకు ఉపయోగపడేలా ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం రూ.16,074 వేల కోట్ల బకాయిలు రైతులకు ఎగ్గొట్టింది. రాష్ట్రం కష్టాల్లో ఉన్నా, చంద్రబాబు వారికి సహాయాన్ని అందించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎప్పుడూలేని విధంగా 48 గంటల్లో డబ్బు జమ చేస్తున్నారు. రూ.5,300 కోట్ల ధాన్యం కొనుగోలు అద్భుతం. ప్రభుత్వ విజయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందాలి. ఇది మంచి ప్రభుత్వమనే నమ్మకాన్ని కలిగించాలి. ప్రభుత్వ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మర్రెడ్డి విజయం సాధించాలని మనోహర్ ఆకాంక్షించారు.