విశాఖపట్నం (చైతన్యరథం): ఏపీలో ఫుట్‌బాల్ స్టేడియం నిర్మించనున్నట్లు ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) చైర్మన్ కళ్యాణ్ చౌబే తెలిపారు. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌తో ఏఐఎఫ్‌ఎఫ్ చైర్మన్ కళ్యాణ్ చౌబే శనివారం విశాఖలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటీవల డీఎస్సీ రిక్రూట్ మెంట్‌లో 3శాతం రిజర్వేషన్ అమలుచేశామని తెలిపారు. ఈ సందర్భంగా చౌబే మాట్లాడుతూ… అమరావతిలో 12 ఎకరాల్లో ఏఐఎఫ్‌ఎఫ్ ఫుట్‌బాల్ స్టేడియం నిర్మించనున్నట్లు చెప్పారు. గ్రాస్ రూట్స్ ఫుట్‌బాల్ సాధికారత కోసం పిఇటిలకు ఫుట్‌బాల్ శిక్షణ ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖతో ఏఐఎఫ్‌ఎఫ్ భాగస్వామ్యం వహించనున్నట్లు తెలిపారు. ఏపీలో ఫుట్‌బాల్ శిక్షకులను గ్రేడ్ చేయడం, వారి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఏఐఎఫ్‌ఎఫ్ క్రియాశీలకం వ్యవహరిస్తున్నట్లు చౌబే చెప్పారు.













