- ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా అవసరం
- రాష్ట్ర సీతాకోక చిలుకగా తిరుమల లిమినియేసి బ్లూ టైగర్ గుర్తింపునకు ప్రతిపాదన
- రాష్ట్ర వన్య ప్రాణి బోర్డు స్టాండిరగ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్
మంగళగిరి (చైతన్య రథం): పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతానికి ఒడిశా వైపునుంచి వస్తున్న మదపుటేనుగుల సమస్యను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మన్యంలో ఏనుగుల సంచారంవల్ల జరుగుతున్న పంట నష్టం, ప్రాణ నష్టంపై నివేదిక ఇవ్వాలని సూచించారు. మదపుటేనుగు గుంపుల జాడను ఎప్పటికప్పుడు తెలుసుకుని పంటలకు నష్టం వాటిల్లకుండా వాటిని మళ్లించే ఏర్పాట్లు చేయాలన్నారు. గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రాష్ట్ర వన్య ప్రాణి బోర్డు స్టాండిరగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకోవాల్సిన అటవీ అనుమతులు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనుషులు, జంతువుల మధ్య జరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దుల్లో మదపుటేనుగుల సంచారం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒడిశావైపు రాష్ట్రంలో ప్రవేశించిన రెండు గుంపులు పంటలను ధ్వంసం చేస్తున్నాయని క్షేత్రస్థాయి నుంచి తెలిసింది. రైతుల ఇబ్బందుల దృష్ట్యా ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. ట్రాకర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని తిరిగి అడవిలోకి మళ్లించాలి.
ఒడిశా వైపునుంచి వస్తున్నాయి కాబట్టి అవసరమైతే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటిని వెనక్కి పంపే విధంగా చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు. రాష్ట్ర పరిధిలో పలు జాతీయ రహదారుల నిర్మాణానికి అటవీ భూములు అవసరం. అటవీ భూములతోపాటు ఎకో సెన్సిటివ్ జోన్, టైగర్ రిజర్వ్ జోన్ పరిధిలోని భూములను సేకరించాల్సి ఉంది. బద్వేల్, నెల్లూరు మధ్య 67వ నంబర్ నాలుగు లైన్ల జాతీయ రహదారి నిమిత్తం 34.67 హెక్టార్ల అటవీ భూమి అవసరం ఉంటుందని అధికారులు తెలియజేశారు. ఈ ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఉంది. ఈ భూములను బదిలీ చేసేందుకు జాతీయ వన్య ప్రాణి బోర్డు స్టాండిరగ్ కౌన్సిల్ అనుమతి కోసం పంపించనున్నాం. బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్‌ప్రెస్ కారిడార్ కోసం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌తో పాటు వెంకటేశ్వర నేషనల్ పార్క్‌నుంచి 40.86 హెక్టార్లు భూమి బదిలీ చేసేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇండియా అనుమతులతోపాటు జాతీయ వన్య ప్రాణి బోర్డుకు నివేదిక అందజేయనున్నాం. ఈనెల 29న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండిరగ్ కమిటీ సమావేశానికి పై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కనిపించే అరుదైన సీతాకోక చిలుక అయిన తిరుమల లిమినియేసి బ్లూ టైగర్ సీతాకోక చిలుకను… రాష్ట్ర సీతాకోక చిలుకగా గుర్తించాలని జాతీయ వన్య ప్రాణి బోర్డు ప్రతిపాదన పంపుతున్నామన్నారు. సమావేశంలో అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం మల్లికార్జున నాయక్, పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ డాక్టర్ పి.వి. చలపతిరావు, మత్స్య శాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్, అడిషనల్ డిజి ఎన్ మధుసూదన్ రెడ్డి, శాస్త్రవేత్తలు దీపా జైశ్వాల్, సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.













