- పెట్టుబడులకు ఈ రంగాలు ఏపీలో అనుకూలం
- రాష్ట్రంలో కోకో ఉత్పత్తి బాగుంది… చాక్లెట్ పరిశ్రమ స్థాపించండి
- అబుదాబీ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీల్లో సీఎం చంద్రబాబు
అబుదాబి (చైతన్య రథం): యూఏఈలోని రెండోరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అబుదాబిలోని వివిధ పారిశ్రామికవేత్తలతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏయే ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయనే అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీవంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్, మస్దార్, అగ్తియా గ్రూప్, లులు గ్రూప్‌వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు విడివిడిగా భేటీ అయ్యారు. ఎనర్జీరంగంలో పెట్టుబడులు పెట్టాలని అపెక్స్ ఇన్వెస్టిమెంట్ ఛైర్మన్ ఖలీఫా ఖౌరీ, మస్దార్ సీఈఓ మొహమ్మద్ జమీల్ అల్ రమాహీని ముఖ్యమంత్రి కోరారు. విశాఖలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ వస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామని అపెక్స్, మస్దార్ సంస్థల ప్రతినిధులకు సీఎం వివరించారు. ఈ క్రమంలో బ్యాటరీ స్టోరేజ్ రంగంలో పెట్టుబడులపై అపెక్స్ ప్రతినిధులు చర్చించారు. సూపర్ కెపాసిటర్స్ రంగంలో పేరొందిన అపెక్స్ సంస్థను ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానించారు.
ఈమేరకు సూపర్ కెపాసిటర్ ఉత్పత్తులను రాష్ట్రానికి పంపాలని అపెక్స్ ప్రతినిధులను సీఎం కోరిన మీదట… సూపర్ కెపాసిటర్ ప్రొడెక్ట్సును పంపేందుకు అపెక్స్ ప్రతినిధులు అంగీకరించారు. ఇక ఆతిథ్య రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని ఎపెక్స్ సంస్థను సీఎం ఆహ్వానించారు. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని మస్దార్ సీఈఓను చంద్రబాబు ఆహ్వానించారు. ఇక అగ్తియా గ్రూప్ సీఈఓతో సల్మీన్ అలమేరీ, లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీతో జరిపిన వేర్వేరు భేటీల్లో ఫుడ్ ప్రాసెస్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆ రెండు సంస్థలను సీఎం ఆహ్వానించారు. ఏపీలో కోకో ఉత్పత్తి బాగుంటుందని… తమ దగ్గర చాక్లెట్ పరిశ్రమ పెట్టే అంశంపై ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి అగ్తియా గ్రూప్‌కు సూచించారు. అలాగే గల్ఫ్ దేశాలనుంచి పారిశ్రామిక వేత్తలను తీసుకుని విశాఖ పెట్టుబడుల సదస్సుకు రావాలని సీఎం ఆహ్వానించారు.














