- జాతీయ మెగా షిప్‌బిల్డింగ్, రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలి
- ‘‘చిప్ టు షిప్’’ విజన్‌తో షిప్‌బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలి
- షిప్పింగ్, జలరవాణా మంత్రికి సీఎం చంద్రబాబు వినతి
- కేంద్ర హోం, పట్టణాభివృద్ధి మంత్రులతో చంద్రబాబు భేటీ
ఢిల్లీ (చైతన్య రథం): ఢల్లీి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సమావేశమయ్యారు. దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై సోనోవాల్‌తో లోతుగా చర్చించారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణరంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘చిప్ టు షిప్’’ విజన్‌కు అనుగుణంగా షిప్‌బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సర్బానందకు విజ్ఞప్తి చేశారు. దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్రం పూర్తి సన్నద్ధంగా ఉందని, ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకూ సిద్ధంగా ఉన్నామని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ‘‘ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధమైంది. నౌక నిర్మాణానికి అనుబంధ ఎంఎస్‌ఎంఈ యూనిట్లు, కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సమగ్ర క్లస్టర్‌గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం -2014లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వండి. దుగరాజపట్నాన్ని నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌గా త్వరితగతిన ఆమోదించాలి’’ అని మంరితి సర్బానందను సీఎం చంద్రబాబు కోరారు.
ఫిషింగ్ హార్బర్లకు కేంద్రం సాయం
‘‘ఫేజ్-1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించండి. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాం. ఫేజ్-1లో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను రూ.1361.49 కోట్లతో చేపట్టాం. జువ్వలదిన్నె హార్బర్‌కు మాత్రమే కేంద్రం నుంచి రూ.138.29 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.782.29 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన మూడు హార్బర్లకు కేంద్ర సాయం ఇంకా అందలేదు. ఫేజ్-1 పూర్తి కోసం ఇంకా రూ.440.91 కోట్లు అవసరముంది. ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలి. మొత్తంమీద రూ.590.91 కోట్లు కేంద్రం నుంచి సహాయంగా అందాల్సి ఉంది’’ అని మంత్రి సర్బానంద దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకొచ్చారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ
ఢల్లీి పర్యటనలో భాగంగా తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఏపీలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను అమిత్ షాకు వివరిస్తూ.. ఏపీలోని రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అనంతరం క్రెడాయ్ నేషనల్ కాన్ క్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
మెట్రో ప్రాజెక్టుకు ఓకే చెప్పండి
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమైన చంద్రబాబు నాయుడు.. విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. సవరించిన డీపీఆర్‌లను కేంద్ర ఆమోదానికి పంపినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు అవశ్యకతను కేంద్ర మంత్రికి వివరిస్తూ.. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుకు కేంద్రం ఓకే చెప్పాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.













