- రహదారులకు జగన్ శాపం
- స్కూలుకి రంగులేస్తే చదువొస్తుందా?
- తెలుగు బిడ్డలంతా నా కుటుంబమే
- సంక్షేమం, అభివృద్ధి నా బాధ్యత
గుంటూరు (చైతన్యరథం): సైకో పాలన కారణంగా రాష్ట్రాభివృద్ధికి అమూల్యమైన ఐదేళ్ల కాలం వృధా అయ్యిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇక మనకు టైం లేదు. 12 రోజులే ఉంది. ఆ చిన్న పాప పసుపు చీర కట్టుకుని రెండు వేళ్లు చూపుతుంది. నా పాప భవిష్యత్తు మీదే చంద్రన్నా అంటున్నాడు బిడ్డ తండ్రి. మీ ఆశలు సఫలీకృతం కావాలంటే మే 13న చరిత్ర తిరగ రాయాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డికి రాజకీయాలకు అర్హత లేదు. గులకరాయి, కోడికత్తి డ్రామాలు ఆడేవ్యక్తి జగన్. బాబాయిని గొడ్డలి వేటుతో లేపేసి వేరే వారిపై నిందలు వేసే వ్యక్తి. నా జీవితంలో ఎప్పుడైనా నేరాలు, ఘోరాలు చేశానా? నేరాలు చేసేవారని తుంగలో తొక్కాను. వారు బయట తిరిగే పరిస్థితి లేకుండా చేశాను. ప్రభుత్వమంటే ప్రజల ఆస్తులు కాపాడాలి. ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి. ఐదేళ్ల కాలాన్ని వృధా చేసుకున్నాం. ఇకపై ఆ తప్పు చేయకూడదు అని బాబు పిలుపునిచ్చారు. నేడు సూపర్ సిక్స్ తీసుకొచ్చాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఒకవైపు, రెండోవైపు జనసేనికులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం బాగుండాలని, యువత భవిష్యత్తు బాగుండాలని వచ్చిన నాయకుడు. అందుకే సూపర్ సిక్స్ ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేసామని కూటమి తరఫున హామీ ఇస్తున్నానని చంద్రబాబు ప్రకటించారు.
ఒక్క రోడ్డుపైనైనా తట్టెడు మట్టివేశాడా?
గుంటూరులోని ప్రతి ఇంటికి పట్టా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంటి జాగాలేని వారికి జాగా ఇస్తామని, టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఉచితంగా లబ్దిదారులకు ఇస్తామని హామీ ఇచ్చారు. గుంటూరులో రోడ్లు బాగున్నాయా? అని ప్రశ్నిస్తూ.. కనీసం పట్టణంలోనైనా రోడ్లు బాగున్నాయా? అన్నారు. గుంటూరు రోడ్లు విశాలమైనవి. వాటిని బాగు చేస్తే గుంటూరు సుందర నగరం అవుతుంది. జగన్‌రెడ్డి ఒక్క రోడ్డునైనా బాగు చేశాడా అని అడుగుతున్నా? మొత్తం భ్రష్టుపట్టించారు. డ్రైనేజీల్లో పూడికలు తీయలేదు. కూటమి ప్రభుత్వం రాగానే గ్రామాలనుంచి మండల ప్రధాన కేంద్రానికి, మండలం నుంచి జిల్లా కేంద్రాలకు మళ్లీ పూర్తిగా రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటా. పోర్టులకు, ఎయిర్ పోర్టులకు వరల్డ్ క్లాస్ రోడ్లు వేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
తెలుగు గడ్డపై పుట్టినవాళ్లంతా నా కుటుంబీకులే
పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో సంపాదించి పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని ఇక్కడకు వచ్చాడు. ఇలాంటి వారు కొన్ని వందలు, వేలమంది విదేశాలు వెళ్లారు. చంద్రశేఖర్‌లా మీరు అమెరికా వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడ కంపెనీలతో ఇక్కడ నుంచే వ్యాపారం చేసేలా చూస్తాం. తెలుగుజాతికి ఆ సత్తా ఉంది. ఈ గడ్డపై పుట్టిన ప్రతీ ఒక్కరు తెలుగుజాతే. వారందరూ నా కుటుంబ సభ్యులే. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు నన్ను ఆదరించారు. నేను కూడా నా జాతిని నిలబెట్టాను. ఐటీని అభివృద్ధి చేసి తెలుగువారిని ప్రపంచం మొత్తం పంపించాను. నన్ను అరెస్టు చేసిన రోజు గుంటూరువాసులు చూపించిన ఆదరణ మర్చిపోను. ఆరోజు పోలీసులు అడ్డుపడ్డా నేడు స్వాగతిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు సైకో చేతిలో లేరు. ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నారు. అందుకే మీరు ధైర్యంగా బయటకు రావాలి అని ఆడబిడ్డలు, ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
స్కూలుకు రంగులేస్తే చదువొస్తుందా?
ప్రతీ ఒక్కరు కూటమి మ్యానిఫెస్టో చదువుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం, ఉద్యోగాలు సృష్టించడం తెలిపిన పార్టీ. అందుకే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. గుంటూరులోనే ఐటీ టవర్లు కట్టి వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తాం. డీఎస్సీ వేస్తాం. జాబ్ క్యాలెండర్ పెడుతాం. పిల్లలందర్నీ బాగా చదివిస్తామని చంద్రబాబు హామీలు గుప్పించారు. స్కూలు బిల్డింగులకు వైసీపీ రంగులు వేస్తే చదువు వస్తుందా తమ్ముళ్లు. విద్యావ్యవస్థను నాశనం చేశాడు. సాగునీటి వ్యవస్థను, ఆరోగ్య వ్యవస్థను నాశనం చేశాడు. అందుకే కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ఇచ్చి ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత `రాష్ట్రానికి అత్యద్భుత పాలన అందిస్తామని హామీ ఇస్తున్నా అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.