- పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి, డోలా
- 20 లక్షల చేపపిల్లలను విడిచిపెట్టిన మంత్రులు
- వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టును సర్వనాశనం చేసిందని మంత్రుల ధ్వజం
- కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టీకరణ
మద్దిపాడు (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ దగ్గర ఏపీ ప్రభుత్వం శనివారం మీనోత్సవం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇరువురు మంత్రులు రిజర్వాయర్‌లో చేపపిల్లలను వదిలి పెట్టారు. మొత్తంగా గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో 20 లక్షలకు పైగా చేపపిల్లలను విడిచిపెట్టారు. ఈ క్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టుపై ఆధారపడి చాలా మంది ప్రజలు జీవిస్తున్నారన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టును సర్వనాశనం చేసిందని విమర్శించారు. ప్రాజెక్టు గేట్లు విరగ్గొట్టి అక్రమ ఇసుక తవ్వకాలతో కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.పది కోట్లు ఖర్చుతో గేట్లను అమర్చుతోందని పేర్కొన్నారు. అతి త్వరలోనే గుండ్లకమ్మ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తుంగభద్ర వరదల సమయంలో సీఎం చంద్రబాబు నాయడు తీసుకున్న చర్యలు చరిత్రలో మిగిలిపోతాయని కొనియాడారు. అటు కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర విషయంలో చేతులెత్తేసినా మన మంత్రులు రామానాయుడు, పయ్యావుల కేశవ్‌లు యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిపుణుడు కన్నయ్యనాయుడితో కలిసి వెళ్లి గేట్లు బిగించి తుంగభద్ర ఆయకట్టు రైతాంగాన్ని కాపాడారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో పులిచింతల గేట్లు, ఏకంగా అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయాయన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసిందన్నారు. 7 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం, రోడ్లపై గుంతలు పూడ్చడం, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రాజెక్టుల గేట్ల మరమ్మత్తులకు, కనీసం గ్రీజుకూ డబ్బులివ్వలేదని ధ్వజమెత్తారు. దీంతో గేట్లు కొట్టుకుపోయి, అపార నష్టం జరిగిందన్నారు. గేట్లు కొట్టుకుపోవడం కారణంగా లక్షలాది రూపాయల విలువైన మత్స్య సంపద కొట్టుకపోయింది. నీరు వృథాగా పోవడంతో రైతుల పొలాలు ఎండిపోయాయి. మత్స్యకారుల్లో ఎక్కువ భాగం గిరిజనులే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొట్టుకుపోయిన గేట్లకు మరమ్మత్తులు చేశాం. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలి. 7 నెలల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్తులో ఈ రిజర్వాయర్ సంతనూతలపాడు, ఒంగోలు, అద్దంకి వాసులకు ప్రధాన వనరుగా మారుతుంది. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని అని మంత్రి డోలా అన్నారు.