అమరావతి (చైతన్య రథం): 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా రూ. 33.25 కోట్ల విలువైన వాహనాలు, వివిధ పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలోని పరేడ్ గ్రౌండ్లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. ఆధునిక వాహనాలు, పరికరాలను స్వయంగా పరిశీలించి వాటిని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అగ్నిమాపక శాఖ కొత్తగా సమకూర్చుకున్న వాటిలో 25 అడ్వాన్స్ వాటర్ టెండర్లు, 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 50 ఇన్ ఫ్లాటబుల్ రబ్బర్ బోట్లు, 30 బీఏ సెట్ కంప్రెసర్లు ఉన్నాయి. రూ.18 కోట్ల వ్యయంతో తొలిదశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాల కొనుగోలు చేశారు. రూ.10 కోట్ల వ్యయంతో హై ప్రెషర్ పంప్‌లు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలను కొనుగోలు చేశారు.
అలాగే రూ.2.49 కోట్లతో 50 ఇన్ ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లను, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను అందుబాటులోకి తెచ్చారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.252.93 కోట్లతో అగ్నిమాపక సేవల ఆధునీకరణ చేపట్టింది. ఆధునీకరణ కోసం వ్యయం చేయనున్న రూ.253 కోట్ల మొత్తంలో కేంద్ర వాటా రూ.189.70 కోట్లు (75శాతం) కాగా, రాష్ట్ర వాటా రూ. 63.23 కోట్లు (25శాతం)గా ఉంది. ఈ నిధుల్లో ఆధునీకరణకు 50శాతం, విస్తరణకు 30శాతం, రాష్ట్ర నిర్దుష్ట అవసరాలకు 15శాతం, శిక్షణ కోసం 5శాతం నిధుల కేటాయించారు. కేంద్ర నిధులను 100శాతం వినియోగించి ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది.















