ఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి, గడిచిన ఐదేళ్లలో జరిగిన ఆర్థిక పరమైన తప్పులను సరిదిద్దేందుకు కేంద్రం సహకరించాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రానికి ఏం కావాలి అనే అంశంపై కేంద్రానికి నివేదిక అందజేశానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి సహకరించాలని కోరామన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో శనివారం దేశ రాజధానిలో జరిగిన ప్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పయ్యావుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ… అమరావతి నిర్మాణానికి సహకారం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలని కేంద్రాన్ని కోరారు.
పారిశ్రామిక రాయితీలు, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు సహకరించాలని, ఆక్వా పార్కులు, టెక్స్టైల్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు మద్దతు కావాలని కోరామన్నారు. తిరుపతి, వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లకు రావాల్సిన రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కోరామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ ఏర్పాటుకు, గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం కృషి చేస్తామని తెలిపారు. చేనేత వస్త్రాలపై 5 శాతం పన్ను మినహాయింపు కోరినట్లు చెప్పారు. సమస్యలు తగ్గించేలా చాలా అంశాలపై జీఎస్టీ మండలిలో నిర్ణయాలు జరిగాయని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని మంత్రిత్వ శాఖల నుంచి వివరాలు సేకరించి కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో ప్రస్తావించామని చెప్పారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని నిలబెట్టాలి.. పరుగులు పెట్టించాలి అన్నది చంద్రబాబు ఆలోచన అని… అది నమ్మారు కాబట్టే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని ఉద్ఘాటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి సమయం పడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం…అనుమానం అవసరం లేదని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.