- క్షతగాత్రులకు రూ.2 లక్షలు
- మంత్రి మండిపల్లి ప్రకటన
కర్నూలు (చైతన్యరథం): కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయి సహాయం అందించనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనిత, రాయలసీమ ఐ జి కోయ ప్రవీణ్‌తో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల మంత్రులతో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం రెండు లక్షల రూపాయలు అలాగే మరణించిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు -ఏపీ హోం మంత్రి అనిత వెల్లడిరచారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. బస్సులో 39 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్నారులతోపాటు గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నట్లు చెప్పారు. ప్రమాదం నుంచి ఇద్దరు డ్రైవర్లు సహా 27 మంది బయటపడ్డారు. స్వల్ప గాయాలతో ఆస్పత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హోం మంత్రి వెల్లడిరచారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడిరచారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయాయన్నారు. చనిపోయిన వ్యక్తుల డీఎన్‌ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేస్తామన్నారు. ఈ ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం 10 ప్రత్యేక బృందాలు పని చేస్తాయన్నారు. ప్రమాదానికి కారణాలు అన్వేషించేందుకు మరో 4 బృందాలు, రసాయన విశ్లేషణ కోసం 2 బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
క్షతగాత్రులకు పరామర్శ
కర్నూలు జిల్లా చిన్నిటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిని మంత్రులు పరామర్శించి వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.










