- అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
- యాత్రలో కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు
- అంతిమయాత్రలో పాడె మోసిన నారా లోకేష్
- పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రులు
పుట్టపర్తి(చైతన్యరథం): వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లి తండాలో అధికార లాంఛనాలతో ఆదివారం జరిగాయి. మంత్రి నారా లోకేష్‌తో పాటు ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సవిత, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. కళ్లితండాలోని నివాసం వద్ద మురళీ నాయక్ భౌతికకాయాన్ని సందర్శించిన లోకేష్ అశ్రు నివాళులర్పించారు. మురళీనాయక్ పార్థీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి సెల్యూట్ చేశారు. అనంతరం అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు. మురళీ నాయక్ స్నేహితులు, బంధువులను పరామ ర్శించారు. యుద్ధానికి ముందు వీరజవాన్ మురళీనాయక్ బంధువు, స్నేహితుడు రాజశే ఖర్‌తో జరిపిన వాట్సాప్ చాట్‌ను పరిశీలించారు.
మురళీనాయక్ జ్ఞాపకాలను ఈ సంద ర్భంగా బంధువులు పంచుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వీరజవాన్ మురళీ నాయక్ అంతిమ యాత్రలో పాల్గొన్న నారా లోకేష్ వీరజవాన్ పార్థీవదేహాన్ని స్వయంగా మోశారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మురళీ నాయక్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలను పూర్తి చేశారు. అంతకు ముందు ఉదయం నుంచి వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి లోకేష్ దుగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను స్వయంగా పరిశీ లించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునా థరెడ్డి, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, జేసీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.