హైదరాబాద్: సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత పోసానిని రాయచోటి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అతనిపై పలు కేసులు ఉన్నాయి. అయితే, ఏ కేసులో అరెస్టు చేశారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో పోసాని వాగ్వాదానికి దిగారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్‌టీవీడీసీ చైర్మన్‌గా పనిచేసిన పోసాని రెచ్చిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు మంత్రి నారా లోకేష్‌ను అసభ్యకరంగా దూషించారు. కూటమి నేతల ఫిర్యాదు మేరకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీలో పలు పోలీస్ స్టేషన్‌లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమేగాక, తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం తర్వాత.. పోసాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.