- ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీల పరిపుష్టి
- శాసనమండలిలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుపై శాసనమండలిలో సభ్యుడు ఏ శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. “ఉమ్మడి అనంతపురంలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు చేశాం. మొత్తం 9 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బోధన సిబ్బంది, 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది పోస్టులను మంజూరు చేశాం. నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి.. ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో డేటా లేదు. ఏ టీచర్ ఎక్కడ పనిచేస్తున్నారో కూడా సమాచారం లేదు. ఈ సమాచారాన్ని సేకరించడానికి నాకు 20 నెలల సమయం పట్టింది. గతంలో నేను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేది. వైసీపీ హయాంలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాల మంజూరు చేసినా, జూనియర్ కాలేజీ మంజూరు చేసినా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌తో ముందుకు వెళ్తున్నాం. ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు అవసరమైన అధ్యాపకులను నియమించాల్సిన అవసరం ఉంది. ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేస్తాం. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ అందజేయాల్సిన అవసరముంది. ఇంటర్ విద్యలో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాం. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం” అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.





