- సమాజ బాగు కోసం తపనపడే వ్యక్తి వెంకయ్యనాయుడు
- ట్రస్ట్ నడపడం అంటే సాధారణ విషయం కాదు
- స్వర్ణ భారత్ ట్రస్ట్ యువతలో స్ఫూర్తిని నింపుతోంది
- విలువలు లేనివారితో పోరాడుతున్నందుకు ఆవేదనగా ఉంది
- స్వర్ణభారత్ ట్రస్ట్ ఉగాది సంబరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): పండుగలు మనదేశ సంస్కృతి, వారసత్వంలో భాగమని, ఏ దేశంలో లేని కళలు, సంప్రదాయాలు మన దేశంలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇతర దేశాల వారు కూడా మన సంప్రదాయాలు, సంస్కృతులను పాటిస్తున్నారంటే అది మన దేశ గొప్పతనమన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూర్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన ఉగాది సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, మహిళలతో సీఎం కాసేపు ముచ్చటించారు. అనంతరం ప్రసంగించారు.
సమాజం కోసం తపనపడే వ్యక్తి వెంకయ్య నాయుడు
తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఈ ఉగాది నుంచే మన తెలుగు వారి పండుగలు ప్రారంభమవుతాయి. కలిసికట్టుగా సమస్యలను ఎదుర్కొనే కుటుంబ వ్యవస్థ మన దేశానికి ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రం, దేశం, సమాజం గురించి తపనపడే వ్యక్తి. నేను, వెంకయ్య నాయుడు ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యాం. అసెంబ్లీలో వెంకయ్య నాయుడు మైకు తీసుకుంటే అందరూ గజగజలాడేవారు. అంచలంచెలుగా ఎదిగారు. ఇద్దరం ఒకే పార్టీలో లేకపోయినా ప్రజాహితం కోసం ఆలోచించాం. ఎన్టీఆర్‌ను సీఎంగా తొలగించినప్పుడు నేను అండగా నిలబడతానని వచ్చి 30 రోజులపాటు పోరాడి మళ్లీ ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఇంటికి వెళ్లారు. సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా పని చేశారు. వెంకయ్యనాయుడు తన పిల్లలకు జీవనోపాధికి మాత్రమే సాయం చేశారు. ప్రజల కోసం ఆయన సృష్టించిన ఆస్తులను చూసి అభినందిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
విలువలు లేని వారితో పోరాడుతుంటే ఆవేదన కలుగుతోంది
రానురాను విలువలు పడిపోతున్నాయని వెంకయ్య నాయుడు అన్నారు. నాకు కూడా అదే అనిపిస్తోంది. ఎన్టీఆర్, జ్యోతిబసు, వాజపేయ్.. సమాజంలో విలువలు గల వ్యక్తులతో నేను పని చేశా. కానీ నేడు రాష్ట్రంలో ఎవరితో పోటీ పడుతున్నానో చూసుకుంటే నిరాశ కలుగుతోంది. కానీ ప్రజల కోసం నిరంతరంగా పని చేయాలి. నేను చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పని చేస్తా. ఒక ట్రస్ట్ నడపడం అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ స్వర్ణ భారత్ ట్రస్ట్‌ను మహిళ అయిన దీపా వెంకట్ నడుపుతున్నారంటే అభినందించాలి. విద్యార్థులతో సమావేశమయ్యాను. ఎంట్రప్రెన్యూర్‌లు అవుతామని, ఉద్యోగాలు ఇస్తామని గ్రామాల్లోని యువత ఆలోచిస్తున్నారంటే ఇది స్వర్ణ భారత్ ట్రస్ట్ నింపిన స్ఫూర్తి. సంస్కృతి, సాంప్రదాయాలను భావి తరాలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను సీఎంగా ఉన్నప్పుడు ట్రస్ట్‌కు భూమి ఇవ్వండని కూడా వెంకయ్య నాయుడు అడగలేదు. ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా అడగకుండా ట్రస్ట్ నడుపుతున్నారు. ఇక్కడ వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకునేవారికి 90 శాతం ప్లేస్మెంట్ వస్తోంది. ప్రకృతి వ్యవసాయం, పాడి వంటి రంగాల్లో ఉత్తమ శిక్షణ ఇస్తున్నారు. 1991లో మన తెలుగువారైన పీవీ నరసింహారావు సంస్కరణలు తీసుకొచ్చి దేశ దశదిశ మార్చారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక ప్రభుత్వం అంటే పరిపాలనే కాదు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు. నేను ఐటీని దూరదృష్టితో ప్రమోట్ చేశాను. దీంతో మనవాళ్లుఈ రోజు ఇతర దేశాల వారితో పోలిస్తే రెండిరతల ఆదాయం సంపాదిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణభారత్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు, మహిళలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వర్క్ ఫ్రమ్ హోం గురించి ఎంతవరకు అవగాహన ఉందని ప్రశ్నించారు. మీ గ్రామాల్లో ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోం కింద పని చేస్తున్నారా అని ఆరా తీశారు. ఇంటిపనులు చేస్తూనే ఉపాధి అవకాశాలపైనా దృష్టి పెట్టాలన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే వర్క్ ఫ్రమ్ హోంకు శ్రీకారం చుట్టామన్నారు. దీనిపై అందరికీ అవగాహన కల్పించేలా చెప్పాలని అక్కడివారికి సూచించారు. స్వర్ణభారత్ తరపున కూడా మహిళల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.