- రాష్ట్రానికి అదనంగా 53 వేల ఎంటి యూరియా
- ఖరీఫ్‌లో 5.65 లక్షల ఎంటి యూరియా సరఫరా
- రబీకి 9 లక్షల ఎంటి యూరియాను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
అమరావతి (చైతన్య రథం): గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రానికి ఎరువుల కేటాయింపు జరుగుతోంది. ప్రస్తుత కేటాయింపులకు అదనంగా 53 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ యూరియా నౌకల ద్వారా కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు చేరుకుంది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల విషయంలో గత ఏడాదికంటే ఈ ఏడాది గణనీయంగా విక్రయాలు పెరిగాయని వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కేంద్రానికి ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉండడంతో రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరుపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని అధికారులు చెప్పారు. కేంద్రం ఇచ్చిన ఎరువులు, యూరియా నిల్వలను మార్క్‌ఫెడ్ సమన్వయంతో రైతులకు సమయానికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టుకు 17,154 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం పోర్టుకు 9,200 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్టుకు 26,547 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది. ఈ సరఫరాతోపాటు గత 10 రోజుల్లో రాష్ట్రానికి 22 వేల మెట్రిక్ టన్నుల యూరియా చేరగా.. వచ్చే 10 రోజుల్లో అదనంగా 30 వేల మెట్రిక్ టన్నులు రానున్నట్టు వ్యవసాయ శాఖ చెబుతోంది. దీనికి తోడు దేశీయంగా వివిధ కంపెనీల నుంచి సరఫరా అయ్యే ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని… రైతులకు ఎరువుల సమస్య తలెత్తే అవకాశం లేదని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిరచారు. ఖరీఫ్ సీజన్‌కు ఇప్పటి వరకూ 5.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా అయినట్టు వ్యవసాయశాఖ తెలియచేసింది. అటు వచ్చే రబీ సీజన్‌కు కూడా మరో 9 లక్షల మెట్రిక్ టన్నుల్ని సిద్ధం చేస్తున్నట్టు వెల్లడిరచింది.
మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరాలో 78శాతం వృద్ధి
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరా గణనీయంగా పెరిగిందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అన్నీ కలిపి గతేడాదికంటే 1.2 లక్షల మెట్రిక్ టన్నులమేర అదనంగా మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా చేశామని అధికారులు తెలిపారు. గతేడాది 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేస్తే… ఈ ఏడాది ప్రస్తుత సీజన్‌లో 2,72,000 మెట్రిక్ టన్నులమేర మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా జరిగిందని వెల్లడిరచారు. గతంతో పోలిస్తే ఇది 78 శాతం అధికమని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక గత ఏడాదిలో 1,11,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తే.. ఈ ఏడాది 2.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని వివరించారు. గతానికంటే అధికంగా 91 వేల మెట్రిక్ టన్నులను సరఫరా చేశామని చెబుతున్నారు. ఇక డీఏపీ సరఫరా కూడా గతానికి మించి 85 శాతం జరిగిందని వెల్లడిరచారు. గత ఏడాది 23,700 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయగా… ఈ ఏడాది 51,700 మెట్రిక్ టన్నుల మేర సరఫరా జరిగిందని స్పష్టం చేశారు. ఈసారి 28 వేల మెట్రిక్ టన్నులు ఎక్కువగా సరఫరా చేశామని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఈ స్థాయిలో జరిగిన భారీ కేటాయింపులతో ప్రస్తుత సీజన్‌తో పాటు వచ్చే రబీ సీజన్‌లోనూ రైతులకు ఎరువుల కొరత ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. యూరియా, ఎరువుల కేటాయింపుల విషయంలో కేంద్రంతో, రైతులకు సరఫరా చేసే అంశంలో మార్క్‌ఫెడ్‌తో సమన్వయం చేసుకుంటున్నామని అధికారులు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వివరించారు.