- విజనరీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు
- విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరుకండి
- ఆస్ట్రేలియా బిజినెస్ ఎగ్జిక్యూటివ్లతో భేటీలో మంత్రి లోకేష్ వినతి
సిడ్నీ/ఆస్ట్రేలియా (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ సోమవారం సిడ్నీ నగరంలో హెచ్ఎస్బీసీ బ్యాంక్ సీఈవో ఆంటోనీ షా నేతృత్వంలోని సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విజనరీ సీఎం చంద్రబాబునాయుడు పెట్టుబడిదారులకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలను ప్రకటించారని, దీంతో కేవలం 16 నెలల్లోనే ఏపీకి రూ.10లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో 1,051కి.మీ.ల సువిశాల తీరప్రాంతంతోపాటు రోడ్లు, అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
విశాఖ సదస్సుకు రావాలి
ఒకసారి ఆంధ్రప్రదేశ్తో ఎంవోయూ చేసుకున్నాక ఆ పరిశ్రమను తమదిగా భావించి అవసరమైన అన్ని అనుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తామని లోకేష్ తెలిపారు. ఆంధ్రపదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో డేటా సిటీగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఏపీలో నెలకొన్న పరిశ్రమల అనుకూల వాతావరణం, అమలుచేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను తెలుసుకునేందుకు వచ్చే నెల 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్కు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఈ భేటీలో అమెజాన్ పబ్లిక్ పాలసీ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆగ్నేయాసియా) డైరెక్టర్ మైఖేల్ కూలే, సిస్కో వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ ఎక్స్ పీరియన్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) జెట్టి మురళి, రిచర్డ్ వాట్సన్ (ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రధాన భాగస్వామి), గ్రెయిన్ కార్ప్ సీఈవో రాబర్ట్ స్పర్వే, హెచ్సీఎల్ టెక్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గీతేష్ అగర్వాల్, జై పటేల్ (హెడ్, కెపీఎంజీ ఇండియా బిజినెస్ ప్రాక్టీస్), మాస్టర్ కార్డ్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ అండ్ గవర్నమెంట్ రిలేషన్స్) టాన్యా స్టోయానాఫ్, ది యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ అండ్ గవర్నమెంట్ రిలేషన్స్) ముత్తుపాండ్యన్ అశోక్కమార్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ డిప్యూటీ డీన్ (రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్) ప్రొఫెసర్ మైఖేల్ బ్లూమెన్ స్టీ, తదితరులు పాల్గొన్నారు.