- 6న కర్నూలుకు హైకోర్టు న్యాయమూర్తుల బృందం
- ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ భవనం పరిశీలన
- మంత్రి ఫరూక్ వెల్లడి
నంద్యాల (చైతన్యరథం): కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే స్థలాన్ని ఎంపిక చేసేందుకు న్యాయమూర్తుల బృందం అక్కడ పర్యటించనుంది. ఈ విషయాన్ని ఏపీ న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ వెల్లడిరచారు. నంద్యాలలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కీలక వివరాలు వెల్లడిరచారు. బెంచ్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6వ తేదీన హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలుకు వస్తున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. దిన్నెదేవరపాడు వద్ద ఉన్న ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ భవనాన్ని వారు పరిశీలిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వరంలో కర్నూలులో త్వరితగతిన హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
మరోవైపు కర్నూలులో 15 మంది న్యాయమూర్తులు ఉండటానికి ఉన్న సౌకర్యాలపై వివరాలు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనవరి 29న కర్నూలు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు గదులు, కోర్టు కాంప్లెక్స్, సిబ్బంది కోసం గదులు, న్యాయవాదుల వసతి వంటి వివరాలపై పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని లేఖ రాశారు. హైకోర్టు రిజిస్ట్రార్ లేఖపై స్పందించిన కర్నూలు కలెక్టర్.. హైకోర్టు కోరిన సౌకర్యాలతో భవనాలు ఉన్నాయా లేవా అనే విషయంపై నివేదిక ఇవ్వాలని ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇంజినీర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఆర్డీవోలకు లేఖ రాశారు. దీంతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కదలిక వచ్చింది. ఇదే సమయంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్.. సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు జడ్జిలతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ నెల ఆరో తేదీన కర్నూలులో పర్యిటించనుంది. కర్నూలు నగరం శివార్లలోని దిన్నెదేవరపాడు వద్ద ఉన్న ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ భవనాన్ని ఈ కమిటీ పరిశీలించనుంది. దిన్నెదేవరపాడులో ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి నూతన భవనాన్ని సుమారు రూ.25 కోట్లతో గతేడాది అధికారులు అత్యాధునికంగా నిర్మించారు. ఇందులో న్యాయస్థానం అవసరాలకు ఉపయోగపడే నాలుగు విశాలమైన హాళ్లు, ప్రత్యేక గదులు అందుబాటులో ఉన్నాయి. ఈ భవనానికి అనుబంధంగా ఉన్న అతిథిగృహం, అందులోని నాలుగు సూట్ రూములను వినియోగించుకోవచ్చు. వీటన్నింటికి సంబంధించి అధికారులు ప్రాథమిక ప్రతిపాదనలను హైకోర్టు రిజిస్ట్రార్‌కు పంపించారు. మరోవైపు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చర్యలు చేపడుతోంది.