శ్రీకాకుళం: ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, కొన్ని శాఖల అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అధికారులపై కక్ష సాధింపులు ఉండబోవని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని కనీసం ప్రజా ప్రతినిధులుగా సైతం గుర్తించలేదని, జెడ్పీ సమావేశాలకు వచ్చి సమస్యలపై చర్చించలేక పోయామన్నారు. తమ నాయకులు ఎవరు వచ్చినా కలెక్టర్, ఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు గౌరవించాలని, ఇబ్బంది అయితే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలన్నారు. తమ నాయకులకు ఏ ప్రభుత్వ కార్యాలయంలో అవమానం జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులను అధికారులు గౌరవించాలన్నారు.
ప్రతి వారం గ్రీవెన్స్ విధిగా నిర్వహించాలని, గ్రీవెన్స్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన నిర్ణయాలు ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. వారం రోజులు అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం స్పెషల్ డ్రైవ్ పెట్టాలని, ఖరీఫ్‌లో రైతులు విత్తనాల కోసం ఇబ్బంది పడకూడదని, రైతులు ఎక్కడైనా ఇబ్బంది పడినా సంబంధిత అధికారులదే బాధ్యత అని అన్నారు. ఎరువులు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా సరఫరా చేయటానికి అధికారులు చర్యలు చేపట్టాలని, వంశధార శివారు ఆయకట్టుకు నీరు అందాలని సూచించారు. తక్షణమే వంశధార అధికారులు కాలువల్లో పూడికతీత, చెట్ల తొలగింపు పనులు చేపట్టాలన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయని, ప్రభుత్వ ఆస్తులు దొంగిలిస్తే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏమి చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.