నిమ్మాడ (చైతన్యరథం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించిన గోడ పత్రికను శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ప్రధాన ఉద్దేశం తుపానులు, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవటం అన్నారు. ఈ పథకం ద్వారా నష్టాన్ని అంచనా వేసి సాగు చేసిన రైతులకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం వర్తింపజేసి పరిహారం అందించనున్నట్టు తెలిపారు. ప్రధానంగా జిల్లాలో వరి(ధాన్యం), మొక్క జొన్న (మక్కా) పంటలకు బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ పథకం కింద రైతులకు సహజ ఉత్పత్తుల నుండి రక్షణ కల్పించేందుకు ఆర్థిక భరోసా అందివ్వనున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ప్రీమియం చెల్లించి అధిక బీమా రక్షణ పొందవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు గోవిందరావు, జగన్మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.