- పొగాకు కొనుగోళ్లపై వాస్తవాలకు విరుద్ధంగా తప్పుడు వార్తలు
- వ్యాపారులు ముఖం చాటేస్తే ప్రభుత్వం ఆదుకుంటోంది
- దేశంలో ఎక్కడాలేని విధంగా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు
- క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోండి
- మీ కథనాలతో మాకు తీరని మనోవేదన
- జగన్‌కు, సాక్షి యాజమాన్యానికి రైతుల లేఖ
అమరావతి (చైతన్యరథం): సాక్షి పత్రికలో వస్తున్న అసత్య కథనాలు తమకు తీరని మనోవేదన కలిగిస్తున్నాయని నల్లబర్లీ పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు చేసేది లేదంటూ కంపెనీలు చేతులెత్తేసిన పరిస్థితుల్లో మార్క్‌ఫెడ్ ద్వారా కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకుంటుంటే.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికి పూర్తి భిన్నంగా సాక్షి దినపత్రికలో అభూత కల్పనలు ప్రచురిస్తున్నారని తప్పుబట్టారు. ఈ మేరకు జగన్ మోహన్‌రెడ్డికి, సాక్షి యాజమాన్యానికి (భారతీరెడ్డి), పత్రిక ఎడిటోరియల్ విభాగానికి బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన పలువురు పొగాకు రైతులు గురువారం బహిరంగ లేఖ రాశారు.
ఆ పత్రిక చదువుతున్న వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలందరికీ… క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాస్తవాన్ని తెలియజేసే ఉద్దేశంతో, కేవలం కమతాన్నే నమ్ముకున్న రైతులుగా ఈ లేఖ రాస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న కర్షకులం, మేము పండిరచిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక ఆందోళనలో మునిగిన తరుణంలో ప్రభుత్వం మా ఇబ్బందులను గుర్తించి, మా కష్టాలను తీర్చేందుకు ప్రత్యక్షంగా మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదుకుంటోంది. మీకు పర్చూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తెలుసా? నల్లబర్లీ పొగాకు రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీరు ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? మా కష్టాన్ని పార్టీలకు సంబంధం లేకుండా మా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏ విధంగా తన నెత్తిన వేసుకున్నారో మీకు తెలుసా? నష్టపోయాం, కంపెనీలు చేతులెత్తేసాయి..దిక్కు తోచని, గత్యంతరం లేని పరిస్థితుల్లో…. ఇక ఆత్మహత్యలే శరణ్యం అనుకున్న దశలో ప్రభుత్వం స్పందించింది.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా..
మమ్మల్ని ఆదుకోవడానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చి మార్క్‌ఫెడ్ ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు చేయిస్తున్నారు. బర్లీ రైతులను ఆదుకునేందుకు వివిధ ప్రాంతాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతి ఏడాది పొగాకు కొనుగోలు చేసే ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు.. ఈ ఏడాది అధిక దిగుబడులు రావటం, విదేశాల్లో డిమాండ్ తగ్గటంతో ముఖం చాటేసి కొనుగోళ్లు జరపలేదు. లక్షలాది రూపాయల పెట్టుబడులు వెచ్చించిన కర్షకులు వ్యాపారుల వైపు దీనంగా ఎదురుచూస్తున్నా… ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదు. ఇలాంటి దీనస్థితిలో ఉన్న బర్లీ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సుమారు 273 కోట్ల రూపాయలు కేటాయించింది. పర్చూరు, అద్దంకి, చిలకలూరిపేట, పత్తిపాడు నియోజకవర్గాల్లో బర్లీ పొగాకు సాగుచేసిన రైతుల కోసం ఆయా మండలాల్లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వం, మార్క్‌ఫెడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో నిత్యం వేలాది పొగాకు బేళ్లను కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. దీంతో బర్లీ రైతుల మోములో కొంతమేర ఆనందం వెల్లివిరుస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
వాస్తవాల వక్రీకరణ..
ఈ కొనుగోళ్లలో పార్టీలను వెతికి వాస్తవాలను వక్రీకరించి, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పూర్తి భిన్నంగా సాక్షి దినపత్రికలో కథనాలు రావడం బాధాకరం. నిజానికి రైతులకు కులాలు లేవు, మతాలు లేవు. ఎన్నికల సమయంలో నచ్చిన పార్టీకి ఓటు వేయడం, జెండా పట్టుకుని తిరగడమే తెలుసు. కానీ సాక్షి పత్రికలో.. పచ్చ రైతులు అని వచ్చిన కథనం కావచ్చు, మరో అసత్య కథనం కావచ్చు.. రైతులకు తీరని మనో వ్యధను కలిగిస్తున్నాయి. నిజానికి పచ్చరైతు, బ్లూ రైతు అనే వాళ్ళు ఎవరూ లేరు. వ్యవసాయం చేసి నష్టపోయే పరిస్థతి నుంచి మమ్మల్ని ప్రభుత్వం కాపాడిరది.. గట్టెక్కించింది. అది మాత్రమే మేము చూస్తున్నాం. రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సాక్షి దినపత్రికలో నిత్యం కావాలనే దుర్బుద్ధితో మీ సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు అసత్య వార్తలను ప్రచురిస్తూ అన్నదాతల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతు శ్రేయస్సు లక్ష్యంగా, రాజకీయాలకు అతీతంగా కొనుగోలు కేంద్రాల్లో పొగాకు కొనుగోలు చేస్తున్నా… సాక్షి పత్రికకు చెందిన విలేకరులు తప్పుడు కథనాలు వండి వారుస్తూ తప్పుదోవ పట్టించడంతోపాటు అన్నదాతలను మనోవేదనకు గురి చేస్తున్నారు.
మీరు క్షేత్రస్థాయిలో బర్లీ పొగాకు రైతుల స్థితిగతులను పరిశీలించి ప్రభుత్వపరంగా అందుతున్న సేవలను గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేశంలోనే ఎన్నడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి బర్లీ రైతులను ఆదుకున్నది ఒక్క ఏపీ ప్రభుత్వం మాత్రమే అనేది గుర్తుంచుకోండి. పర్చూరు నియోజకవర్గంలో సాక్షి దినపత్రికకు చెందిన విలేకరులు తరచుగా బర్లీ రైతులను అయోమయానికి గురిచేస్తూ పొగాకు సాగు చేయని వ్యక్తుల చిత్రాలతో… బాధిత రైతులుగా చూపుతూ తప్పుడు వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ఇప్పటికైనా రైతన్నను ఆదుకునేందుకు, రైతుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు పత్రికా పరంగా తోడ్పాటు ఇవ్వాలని, తప్పుడు రాతలను వండి వారుస్తున్న వారి మనస్సులను మార్చాలని కోరుతున్నామని ఆ లేఖలో రైతులు పేర్కొన్నారు.