- సంస్థ సీఈఓ కళ్యాణ్ కుమార్‌ను కోరిన మంత్రి లోకేష్
దావోస్ (చైతన్యరథం): ఏపీలో మరో 10వేల మందికి ఉపాధి కల్పించేలా హెచ్‌సీఎల్‌ను విస్తరించాలని ఆ సంస్థ సీఈఓ కళ్యాణ్‌కుమార్‌ను రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. హెచ్‌సీఎల్ సీఈఓ కళ్యాణ్ కుమార్‌తో దావోస్ బెల్వేడేర్‌లో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో హెచ్‌సీఎల్ విస్తరణ కార్యకలాపాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0ను వివరించిన మంత్రి లోకేష్…. రాష్ట్రంలో మరో 10వేల మందికి ఉపాధి కల్పించేలా హెచ్‌సీఎల్ ను విస్తరించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్తపాలసీలో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఎఫ్‌ఐడీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించామని చెప్పారు. ఏపీలోకి రీలొకేషన్ చేసే పరిశ్రమలు, ఎక్విప్‌మెంట్ ఇంపోర్ట్‌కు 50శాతం సబ్సిడీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిరంగంలో ఏపీ 10శాతం వాటా కలిగి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, 3 డెడికేటెడ్ ఐటీి స్పెషల్ ఎకనమిక్ జోన్లు ఉన్నాయని లోకేష్ చెప్పారు.
హెచ్‌సీఎల్ సిఇఓ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ… తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థలో 2.18లక్షల మంది పనిచేస్తున్నారన్నారు. 2024-25లో హెచ్‌సీఎల్ 4,235 కోట్ల రూపాయల నికరలాభాన్ని ఆర్జించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ విస్తరణ కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నాం, ఇప్పటికే సంస్థ ప్రతినిధులు మీతో చర్చలు జరిపారు. త్వరలో విస్తరణ కార్యకలాపాలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని కళ్యాణ్ కుమార్ హామీ ఇచ్చారు.