మంగళగిరి (చైతన్యరథం): మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ పోటీలు ఐదవ రోజు గురువారం ఉత్కంఠభరితంగా కొనసాగాయి. మంగళగిరి వర్సెస్ పశ్చిమగోదావరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పశ్చిమగోదావరి జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పశ్చిమగోదావరి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి గాను 199 పరుగులు చేసింది. 200 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన మంగళగిరి జట్టు 102 పరుగులకే ఆల్ అవుట్ అయి పరాజయం పాలైంది. 47 బంతుల్లో 87 పరుగులు చేసిన రక్షణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నాడు.
తూర్పుగోదావరి వర్సెస్ కృష్ణా జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగిన మరో మ్యాచ్ టై అయింది. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు ఇరు జట్లతోనూ సూపర్ ఓవర్ వేయించారు. సూపర్ ఓవర్‌లో 3 పరుగుల తేడాతో కృష్ణాపై తూర్పుగోదావరి జట్టు విజయం సాధించింది. 33 బంతుల్లో 53 పరుగులు చేసిన జయంత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఇద్దరికీ మంగళగిరి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు భోగి వినోద్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కనికళ్ళ చిరంజీవి సహకారంతో ఒక్కొక్కరికీ రూ 10 వేలు చొప్పున నగదు బహుమతి అందజేశారు. ఈవెంట్ స్పాన్సరర్లుగా సేల్, సక్కు, మార్కోరోస్, ఉషోదయ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్రతి మ్యాచ్‌ను గోపి టీవీ యూట్యూబ్ ఛానల్, వీ డిజిటల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నారు.
ప్రీమియర్ లీగ్, సీిజన్-3 పోటీలలో ప్రథమ బహుమతి కింద రూ 3 లక్షలు కొమ్మారెడ్డి కిరణ్, ద్వితీయ బహుమతి కింద రూ 2 లక్షలు కాట్రగడ్డ మధుసూదన్ రావు, తృతీయ బహుమతి కింద రూ. లక్ష నగదును పల్నాటి నాగేశ్వరరావు, అమ్మిరెడ్డి సాంబశివరావు సహకారంతో ప్రదానం చేయనున్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రూ. 50 వేలు బత్తుల హరిదాస్, బెస్ట్ బ్యాట్స్‌మెన్ కు రూ. 25 వేలు కాసరనేని జస్వంత్, బెస్ట్ బౌలర్‌కు రూ. 25 వేలు తాడిపత్రి అజయ్ కుమార్, ప్రతి మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రూ.10 వేల నగదును భోగి వినోద్, కనికళ్ళ చిరంజీవి సహకారంతో నగదు బహుమతులు అందించనున్నారు.