- ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన పడొద్దు
- యూరియా బ్లాక్ మార్కెట్ తరలిస్తే కఠిన చర్యలు
- మార్క్ ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల విక్రయాలు
- గత ఏడాదితో పోలిస్తే 91 వేల మెట్రిక్ టన్నులు అదనం
- రసాయినాల వినియోగంపై రైతుకు అవగాహన కల్పించాలి
- తక్కువ మొత్తంలో వాడే రైతులకు సబ్సిడీలు
- కాఫీ తోటల తెగుళ్లపై తక్షణం చర్యలు చేపట్టాలి
- ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. డిమాండ్‌కంటే అదనంగానే నిల్వలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ-క్రాప్ ద్వారా రాష్ట్రంలో ఎంతమేర ఏయే పంటలు సాగు అవుతున్నాయి, ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందన్న లెక్కలు తీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈసారి 2.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయ్యిందని.. వాస్తవ డిమాండ్‌కంటే అదనంగా నిల్వలున్నాయని అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే ఈసారి 91 వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చినట్టు తెలిపారు. ఇక డిఏపి 51,700 మెట్రిక్ టన్నులమేర వచ్చిందని.. గత ఏడాదితో పోలిస్తే 16 వేల మెట్రిక్ టన్నులు ఇది అదనమని అధికారులు సీఎంకు తెలిపారు. కాంప్లెక్స్ ఎరువులు కూడా ప్రస్తుత ఏడాదిలో 2.72 లక్షల మెట్రిక్ టన్నులమేర వచ్చిందని వివరించారు. గతంతో పోలిస్తే 1.20 లక్షల మెట్రిక్ టన్నులు ఇది అదనమని తెలియచేశారు. దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రంలో ఎరువుల లభ్యత ఇంతగావున్నా.. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా యూరియా వినియోగం కూడా లెక్కించాలని అన్నారు.
రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం తగ్గితే సబ్సిడీలు
రసాయన ఎరువులు, పురుగు మందులరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆమేరకు వాటి వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. పంటల సాగులో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించిన రైతులకు రాయితీలు ఇచ్చే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎవరు ఎంత వినియోగిస్తున్నారనే అంశాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఎరువుల వినియోగంపై గణాంకాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
11 ఉద్యాన పంటలకు సాగు ధర దక్కాలి
రాష్ట్రంలోని 11 ఉద్యాన పంటలకు సంబంధించి సాగు వ్యయానికి తగినట్టే ఆయా పంటలకు కనీస ధర వచ్చేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్ట పోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మరోవైపు కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన బోరర్ తెగులుపై తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కొత్త తెగులు వచ్చిన కాఫీ పంట 20 ఎకరాల్లో ఉందని… దానిని తక్షణం తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇతర ప్రాంతాలకు తెగులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. అలాగే తొలగించిన పంటకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లపాటు ట్రాప్‌లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. మరోవైపు ఉల్లి పంట మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందిగా అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు చేసిన ఉల్లిని స్థానికంగా కమ్యూనిటీ హాళ్లను తీసుకుని ఆరబెట్టాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఇప్పటి వరకూ హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లకు సంబంధించి రూ.54 కోట్ల రూపాయలను చెల్లింపులు జరిగాయని .. మరో రూ.59 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ కె.విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.