ఆంధ్ర రాష్ట్రం -పూర్తి వ్యవసాయక ప్రాంతం. భారత వ్యవసాయ క్షేత్రంలో విలక్షణ పాత్ర పోషిస్తోన్న ప్రాంతం కూడా ఆంధ్ర రాష్ట్రమే. పారిశ్రామికంగా రాష్ట్రం ఎంత పురోగమన దశలోవున్నా.. ఇక్కడి జీవనాధారం, ప్రగతి సూచికం వ్యవసాయమే అనడానికి సందేహించక్కర్లేదు. మారుతున్న కాలంలో -పారిశ్రామిక ప్రగతి లక్ష్యాలకు సమాంతరంగా సేద్యం వృద్ధినీ సాధించాలన్నది ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానంగా కనిపిస్తోంది. అయితే వాతావరణ అనిశ్చితి, నేల క్షీణత, నీటి కొరత, మార్కెట్ ఒడుదొడుకులు, పంట నష్టాలు.. సాగు రంగానికి సవాళ్లుగా నిలుస్తోన్న అంశాలు. ఈ సవాళ్లను అధిగమించేందుకు -రేపటి సాంకేతికతగా ఆవిర్భవిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగును ప్రయోగించి.. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన, ఆకాంక్ష కూడా!
ప్రపంచవ్యాప్తంగా -రవాణా, వాతావరణం, ఔషధ తదితర రంగాలలో కాలానుగుణంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఇప్పటికే క్వాంటం సాంకేతికత విస్తృత వినియోగంలో ఉంది. సాగు రంగానికి దీనిని అనుసంధానించి.. కీలక ఆవిష్కరణలకు మార్గాలు చూపాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సమర్ధించి తీరాలి. ఒక సమస్యకు ఒకే పరిష్కారాన్ని కాకుండా.. అనేక సమస్యలకు అనేకానేక పరిష్కారాలు సూచించగలిగే శక్తి -క్వాంట. సేద్య రంగంలోని అనేక కఠిన సవాళ్లను ఉమ్మడిగా విశ్లేషించి.. అనేకానేక పరిష్కారాలను క్షణాలలో సూచించగలిగే ప్రత్యేక సాధనంగా -క్వాంటమ్ పరిజ్ఞానాన్ని చూడక తప్పదు.. వ్యవసాయంలో నేల పరిస్థితి, వాతావరణ నమూనాలు, తెగుళ్ల ప్రవర్తన, మార్కెట్ శక్తులవంటి అంశాలన్నీ ఒకదానితో ఒకటి సంక్లిష్టంగా అనుసంధానమై ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటర్లు వీటన్నింటినీ ఒకేసారి విశ్లేషించగలవు.
ఒక వంట సీజన్ ను సమగ్రంగా విశ్లేషించి విభిన్న రకాల పసులను అత్యంత నిక్కచ్చిగా పూర్తి చేయగలవు. ఏపీలో -తీరప్రాంత జిల్లాలు తుపాన్లకు గురవుతుంటాయి. రాయలసీమ కరవులను ఎదుర్కొంటోంది. పాడేరు, అరకువంటి గిరిజన ప్రాంతాలు సేంద్రియ సాగును అనుసరిస్తున్నాయి. కృష్ణ, గుంటూరు జిల్లాలు అధిక విలువైన పంటలకు కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. ఈ వైవిధ్యం ఏపీని క్వాంటం ఆధారిత పరిష్కారాలకు అనువైన పరీక్షా క్షేత్రంగా మార్చుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రియల్ టైమ్ సేకరణ వ్యవస్థలు, ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్, రైతుసేవా కేంద్రాల వంటి డిజిటల్ వ్యవస్థలూ ఇందుకు బలమైన పునాదిని అందిస్తున్నాయి. వ్యవసాయ వర్సిటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, శ్రీసిటీ, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ వంటి సంస్థల తోడ్పాటూ దక్కుతుంది.
అనంతపురం, శ్రీకాకుళంవంటి జిల్లాల్లో వర్షాభావం రైతులకు పెద్ద సవాలు. క్వాంటమ్ ఆధారిత నమూనాలు స్థానిక వాతావరణం, నేలలో తేమ, పంటతీరును కొన్ని నెలల ముందుగానే విశ్లేషించగలవు. తద్వారా రైతులు సరైన పంటలను ఎంచుకునేలా, సరైన సమయంలో నాటడంతో పాటు కోతకు సిద్ధమయ్యేలా సాయపడతాయి. నేల రసాయన గుణాలను విశ్లేషించి.. నీరు, పోషకాల సరైన మోతాదులను సూచిస్తాయి. దీనివల్ల సాగు వ్యయాలు తగ్గుతాయి.
పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. దీర్ఘకాలంపాటు నేల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. ఐవోటీ డేటా, ఉపగ్రహ చిత్రాలు, క్వాంటమ్ ఆధారిత మెషీన్ లెర్నింగ్పంటి సాంకేతికతలన్నీ కలిసి తెగుళ్లు, చీడపీడలకు సంబంధించిన సంకేతాలను ముందుగానే గుర్తిస్తాయి. దీనివల్ల మిరప, అరటి, ద్రాక్షవంటి అధిక విలువైన పంటలను కాపాడుకోవచ్చు. రవాణాలో ఆలస్యం, నిల్వ కష్టాలు, మార్కెట్తో అనుసంధానంలో లోపాలవల్ల పండ్లు, కూరగాయల సాగులో గణనీయమైన నష్టం సంభవిస్తోంది. క్వాంటమ్ అల్గారిథమ్లు వేలకొద్దీ సరఫరా గొలుసు దృశ్యాలను రియల్ టైమ్లో విశ్లేషించి, అత్యంత సమర్థమైన మార్గాలను సూచించగలవు. మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని మెరుగు పరుస్తాయి.
ఫలితంగా నష్టాలు తగ్గుతాయి. ఏపీ వ్యవసాయ రంగంలో క్వాంటమ్ కంప్యూటింగును పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి అగ్రిటెక్, ఫిన్స్టిక్ మెషీన్లతో అనుసంధానించాలి. క్వాంటమ్ ఆలోచనలు పరిశోధన పత్రాలకే పరిమితంగాకుండా యాప్లు, ఆర్థిక సాధనాలు, బీమా ఉత్పత్తులు, స్టార్టప్ల ఆవిష్కరణలలో భాగంగా కావాలి. ప్రస్తుతం ఏపీలో వినియోగంలోవున్న డ్రోన్లు, నేల పరీక్ష కిట్లు, ఏఐ ఆధారిత సలహాలవంటి అగ్రిటెక్ సాధనాలకు క్వాంటమ్ కంప్యూటింగ్ మెరుగైన సామర్థ్యాలను జోడిస్తుంది. రియల్ టైమ్లో వాతావరణం, నేల, మార్కెట్ డేటా ఆధారంగా ఒక నేలకు నిర్దుష్ట విత్తన రకాన్ని సిఫార్సు చేస్తుంది. తెగుళ్ల రాకను అంచనా వేస్తుంది. డిమాండ్ అంచనాలు, ధరల సిమ్యులేషన్ ఆధారంగా పంట కోత సమయాన్ని నిర్ణయించడంలో సహాయ పడుతుంది. వంట బీమా ప్రీమియంలనూ నిర్దిష్టంగా లెక్కించవచ్చు. గత దిగుబడులు, భవిష్యత్ సమస్యలను పరిగణనలోకి తీసుకుని కిసాన్ క్రెడిట్ స్కోర్లను రూపొందించవచ్చు. మార్కెట్ ధరల అంచనా సాధనాలవల్ల పంటలను బలవంతంగా అమ్ముకునే అగత్యం రైతులకు తప్పుతుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు, గ్రామీణ వ్యవసాయ ఔత్సాహికులు, క్వాంటమ్ సాంకేతికత, వ్యవసాయ, ఆర్థికరంగాల మేలుకలయికలో మేలైన ఆవిష్కరణలను సృష్టించే అవకాశం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వ్యవసాయంలో క్వాంటమ్ సాంకేతికతలను వినియోగిస్తున్నాయి. నెదర్లాండ్స్లోని వాగెనింగెన్ వర్శిటీ క్వాంటమ్ ఆధారిత నేల, పశుసంవర్ధన సిమ్యులేషన్లపై కృషిచేస్తోంది. ఇజ్రాయెల్ నీటి కొరత, వ్యవసాయ ప్రణాళిక కోసం క్వాంటమ్ అంచనా నమూనాలను ఉపయోగిస్తోంది. ఇలాంటివాటినుంచి ఎంతో నేర్చుకోవచ్చు. స్టార్టప్ల సహకారంతో వాటిలో భాగస్వామ్యమూ పొందవచ్చు.
క్వాంటమ్ కంప్యూటింగును సాగురంగంలో ఆచరణాత్మక సాధనంగా తీర్చిదిద్దడానికి వ్యవసాయం, ఐటీ, ప్రణాళిక శాఖలు సంయుక్తంగా స్పష్టమైన లక్ష్యంతో ప్రత్యేక మిషన్ను నెలకొల్పాలి. విత్తన గ్రాంట్లు, మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆధారిత వ్యవసాయ సలహా వేదికలు, పంట రుణాలు, బీమా, పొలంనుంచి మార్కెట్కు క్వాంటమ్ ఆధారిత రవాణా సాధనాలపై పనిచేసే స్టార్టప్లను ప్రోత్సహించాలి. స్థానిక వాతావరణం, తెగుళ్ల తీరు, విత్తన చక్రాలపై రైతులకు తరతరాలుగా అపార అనుభవం, విజ్ఞానం ఉంటుంది. దీన్ని మరింత బలోపేతం చేయడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ తోడ్పడుతుంది. ఏఐ ఆధారిత తెగుళ్ల హెచ్చరికలను రైతుల సంప్రదాయ పంటల పరిజ్ఞానంతో అనుసంధానించడం ద్వారా వ్యవసాయ పునరుజ్జీవనం సాధ్యమవుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా, వ్యవసాయ సాంకేతిక పరిణామంలో ఏపీకి మెరుగైన భవిష్యత్తును సృష్టించే అవకాశాన్ని అందించగలదు.