- ఆర్థికేతర సమస్యలపై ఫోకస్ పెట్టండి
- వాటిని నిర్లక్ష్యం చేస్తే సహించను…
- ప్రజా ప్రతినిధులకూ ప్రాధాన్యతనివ్వండి
- వచ్చే కలెక్టర్ల సదస్సులో జీరో పెండెన్సీ ఉండాలి
- పరిష్కారంకాని సమస్యను అర్థవంతంగా చెప్పండి
- జూన్‌నుంచి నవంబరుకు 1.69 లక్షల ఫిర్యాదులు
- 1.39 లక్షలు పరిష్కరించామన్న అధికారులు
అమరావతి (చైతన్య రథం): పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే ప్రతి సమస్యా పరిష్కరించాల్సిందేనని, ఆర్థికేతర సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించేవరకూ రాజీపడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)పై కలెక్టర్ల సదస్సులో అధికారులిచ్చిన ప్రజెంటేషన్‌పై ముఖ్యమంత్రి స్పందిస్తూ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సమస్యలు పరిష్కరిస్తున్నా ప్రజాసంతృప్తి రాకపోతే.. ఎక్కడో సమన్వయలోపం ఉన్నట్టు గుర్తించి తగువిధంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆర్థికేతర సమస్యలు వందశాతం పరిష్కరించాలని గట్టిగా ఆదేశించారు. దీనిపైన తాను చాలా సీరియస్‌గా ఉన్నానంటూ.. కలెక్టర్లు కూడా సమస్యల పరిష్కారంపై ర్యాండమ్‌గా ప్రజాభిప్రాయం తీసుకోవాలని సూచించారు. కొన్ని సమస్యలను కొంతమంది మళ్లీమళ్లీ తీసుకొచ్చి వాటికోసం కార్యాలయాలవెంట తిరుగుతుంటారని, అలాంటి వాటిని గుర్తించి వాటిని పరిష్కరించగలమా? లేమా? అనేది చూసుకుని పౌరులకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలన్నారు. కోర్టు కేసులు కొన్ని ఇతరత్ర కారణాల వల్ల కొన్ని సమస్యలను పరిష్కరించలేని పరిస్థితులు ఎదురవుతాయని, అలాంటి వాటిని కూడా మానవీయ కోణంలో పరిశీలించి దాన్ని పరిష్కరించడానికి సాధ్యమైనంత వరకూ ప్రయత్నించాలని, అప్పటికీ సమస్య పరిష్కరించడం సాధ్యంకాకుంటే ఆ విషయం ఫిర్యాదుదారుడికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని అన్నారు. అలాగే పోర్టల్‌లో కూడా ఆ విషయం తెలియజేసి పారదర్శకంగా ఉండాలన్నారు. ‘కోర్టు కేసుల్లో పేదవాడు బలవంతుడితో పోరాడలేకపోతున్నాడు. న్యాయం పేదవాడివైపు ఉందని మనకు అనిపిస్తే అలాంటివారికి అవసరమైతే న్యాయ సహాయం అందించే వీలుందేమో పరిశీలించాలి. మానవీయ కోణంలో సమస్యలను చూడాలి. సమస్యల పరిష్కారంలో క్వాలిటేటివ్ డిస్పోజల్ చాలా ముఖ్యం’ అని చంద్రబాబు అధికార యంత్రాంగానికి సూచించారు.
ప్రజా ప్రతినిధుల తెచ్చిన సమస్యలకు ప్రాధాన్యమివ్వాలి
తమది పొలిటికల్ గవర్నెన్స్ అని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నో ఆకాంక్షలు, ఆశలతో తమను గెలిపించారని, ప్రజాప్రతిధులు ప్రజల సమస్యలు తీసుకొచ్చినప్పుడు వారిని గౌరవించి, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజలకు ప్రజాప్రతినిధుల పట్ల ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయని, వారి వద్దకు సమస్య తీసుకొచ్చినప్పుడు వాటిని అధికారులు పరిష్కరించకపోతే ఎలా? అన్నారు. చట్టం పరిధిలో, నిబంధనలకు లోబడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ఆరు నెలల్లో 1.69 లక్షల ఫిర్యాదుల స్వీకరణ
గత ఆరు నెలల్లో ప్రజలనుంచి 1,69,200 అర్జీలు స్వీకరించామని సాధారణ పరిపాలన కార్యదర్శి ఎస్ సురేష్‌కుమార్ తెలిపారు. పీజీఆర్‌ఎస్‌పై కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. జూన్ 15నుంచి నవంబరు 30వరకు ప్రజల నుంచి ప్రభుత్వానికి మొత్తం 1.69 లక్షల ఫిర్యాదులు అందాయని, అందులో ఇప్పటికే 1.39 లక్షల ఫిర్యాదులు పరిష్కరించామని, 10వేల సమస్యలను మళ్లీ పరిష్కారం కొరకు రీ ఓపెన్ చేశామన్నారు. పది శాఖలనుంచి మొత్తం 76 రకాల సమస్యలు వస్తున్నాయని, అందులో రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయన్నారు. ల్యాండ్ రికార్డులు, క్రైమ్, భూకబ్జాలు, సచివాలయ ఉద్యోగులపై ఫిర్యాదులు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. జీరో పెండెన్సీ దిశగా సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్లు అందరూ పని చేయాలని కోరారు.