- ఐటీ గురించి మాట్లాడినా… వ్యవసాయంపైనే ఆలోచన
- సాగును లాభదాయకంగా చేయడమే లక్ష్యం
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి నెలా పొలాలను సందర్శించాలి
- మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులుండాలి
- మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ తో నీరు, వనరుల ఆదా
- రసాయన ఎరువుల అధిక వినియోగంతో ప్రజారోగ్యం, పంట ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
- ట్రంప్ కారణంగా విలవిలలాడుతున్న ష్రింప్
- ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి
- రూ.1000 కోట్ల భారమైనా ఆక్వాను ఆదుకునేలా చర్యలు
- మరో గేమ్‌ఛేంజర్ గా ఉద్యాన రంగం
- వ్యవసాయ, ఉద్యాన రంగాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
అమరావతి (చైతన్యరథం): నేను ఎప్పుడు ఐటీ గురించే మాట్లాడతానని అనుకుంటారు.. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని.. నేను చేసిన పనులన్నీ రైతులకు ఉపకరించేవే.. నీరు-చెట్టు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, కాలువలు ఇలా ప్రతీ అంశంలోనూ వ్యవసాయ రంగానికి అనుకూలమైన ఆలోచనలే చేశా.. సాగునీరు, వ్యవసాయ రంగం అభివృద్ధికే నిర్ణయాలు తీసుకున్నాను.. రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లలో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేలా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సోమవారం అసెంబ్లీలో వ్యవసాయ శాఖపై లఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే వ్యవసాయ శాఖపరంగా తీసుకుంటున్న నిర్ణయాలు.. రైతులకు
లబ్ధి చేకూర్చిన అంశాలను చెప్పడంతో పాటు.. భవిష్యత్తులో రైతు సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామనే విషయాలను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివరించారు. ఈ
సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతి నిర్ణయమూ రైతు కోసమే తీసుకుంటున్నానని, వ్యవసాయాన్ని లాభదాయకం చేసే అంశం మీదే ప్రతి నిమిషం ఆలోచిస్తున్నానని స్పష్టం చేశారు.
వ్యవసాయం మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థ మనది. అందుకే ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలని నిర్ణయించాం. ప్రతి పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చూస్తున్నాం. అందుకే రకరకాల పంటలను ప్రొత్సహిస్తున్నాం. ఆక్వాను ప్రొత్సహిస్తున్నాం. వ్యవసాయాన్ని ఓ పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తున్నాం. వ్యవసాయం లాభసాటిగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం.. ఏ పంట వేస్తే గిట్టుబాటు ఉంటుందో చూసి ఆ పంటలు వేసేలా ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
ప్రజా ప్రతినిధుల పొలం బాట
ప్రతీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నెలకు ఒక్క రోజు పొలం దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడాలి. అక్టోబరు నుంచి ప్రతీ నెలా రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు విని పరిష్కారం చేస్తాం. ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తాం. ప్రజా ప్రతినిధులు.. రైతుల వద్దకు వెళ్లి వారి గురించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేస్తోంది, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందనేది వివరించాలి. ప్రతీ ప్రజా ప్రతినిధి వ్యవసాయంపై దృష్టి పెట్టాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం. పురుగు మందులు,ఎరువుల వాడకంలో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ ఉంది. తెగుళ్లను గుర్తించి నివారణ చర్యల కోసం డ్రోన్లను వాడొచ్చు. అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల ఆక్వాలో అగ్రస్థానంలో ఉన్న ఏపీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులకు సంపద రావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సాగు వ్యయాన్ని తగ్గించడానికి టెక్నాలజీతో రైతును ఆదుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
యూరియాపై రైతులను మోసగిస్తున్న నేతలు
రైతులకు వాస్తవాలు చెప్పి పురుగుమందులు, ఎరువులు ఎక్కువగా వాడుతుంటే వారికి అవగాహన కల్పించాలి. వరదలు, వర్షాలతో ఎరువు కొట్టుకుపోవటం వల్ల బూస్టర్ డోస్ ఇచ్చారు. రాష్ట్రంలో 1.16 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది అదనంగా పంట వేశారు. 25 శాతం మేర యూరియా ఎక్కువ వినియోగించారు. దాణా పెంచడానికి కూడా యూరియాను వినియోగించుకున్నారు. ఖరీఫ్ సీజన్ కు 16.70 లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియా అలాట్మెంట్ వచ్చింది. ప్రస్తుతం 5.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలో అందుబాటులో ఉంది. యూరియా ఎక్కువ వినియోగించటం వల్ల పాలు కూడా కలుషితం అవుతున్నాయి. యూకలిప్టస్, పసుపు లాంటి పంటలకు కూడా యూరియా వాడేస్తున్నారు. రాష్ట్రంలో హెక్టారుకు సగటున 255 కేజీల మేర యూరియా వినియోగం జరుగుతోంది. తద్వారా భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. భూసారం కూడా దెబ్బతింటోంది. ప్రజారోగ్యంతో పాటు పంట ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతోంది. కొత్త తెగుళ్లతో పంటలు దెబ్బతింటున్నాయి. రసాయనాలు, యూరియా అధిక వినియోగంపై రైతుల్ని చైతన్యపర్చాల్సి ఉంది. ఫెర్టిలైజర్ల వినియోగం వల్ల మార్కెట్ ఉండదు. పీఎం ప్రణామ్ కింద రసాయన ఎరువుల వినియోగం తగ్గించిన రైతులకు రూ.800 సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాకే బదిలీ చేస్తాం. టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ వల్ల రైతులు నష్టపోకూడదు. బాధ్యతలేని నాయకులు ఎరువులు ఇవ్వలేదంటూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్టిఫికేషన్ ఇచ్చిన ఆహారాన్నే తీసుకుంటున్న ఆ నేతలు రైతులను మోసగిస్తున్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న రైతు ప్రభుత్వం కూటమిది. రైతులు ఉత్పత్తి చేసే పంటలపై శ్రద్ధపెట్టాలి, సేంద్రియ ఎరువులు ఉపయోగించి, రసాయన పురుగు మందులు తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులు పండిద్దామని సీఎం చంద్రబాబు సూచించారు.
నీటి వసతి పెంచాం… సాగు విస్తీర్ణం పెరిగింది.
సమర్ధ నీటి నిర్వహణ కారణంగా అన్ని రిజర్వాయర్లల్లో నీటితో కళకళలాడుతున్నాయి. నెల్లూరులో ఎప్పుడూ ఒక వంటే వేస్తారు. ఈసారి అక్కడ రెండు పంటలు వేశారు. రైతులకు సమృద్ధిగా నీరు అందుతుండడంతో పంటలు విరివిగా వేస్తున్నారు. అదే దిశలో మేమూ రైతు సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద రూ.20 వేలు రైతుల ఖాతాలో వేస్తున్నాం. తొలి విడతగా రూ.7 వేల చొప్పున మొత్తంగా రూ.3173 కోట్లు రైతుల ఖాతాలో వేశాం. ఉల్లి ధరలు పడిపోతే హెక్టారుకు రూ.50 వేల నష్ట పరిహారం ప్రకటించాం. ఈ స్థాయిలో ఉల్లి పంటకు నష్టపరిహరం గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. అలాగే టమాటో ధర పడిపోయినా… ప్రభుత్వం 1267 మెట్రిక్ టన్నుల టమాటాలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. మామిడికి రూ.194 కోట్ల మేర అదనంగా చెల్లింపులు చేసి రైతును ఆదుకున్నాం. మిర్చి, కోకో, పత్తి, పొగాకు రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాం. ప్రకృతి సేద్యాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సమర్ధ నీటి నిర్వహణ ద్వారా ప్రతీ ఎకరాకు నీటిని ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాం. అగ్రిటెక్ భాగంగా వ్యవసాయ యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. కిసాన్ డ్రోన్స్ ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నాం. రుతుపవనాల కారణంగా ఈసారి చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉంది.
అనంతపురంలో అమలు చేసిన మైక్రో, డ్రిప్ ఇరిగేషన్‌ను నమూనాగా తీసుకుని ప్రధాని మోదీ గుజరాత్లో అమలు చేశారు. అందుకే దేశంలో ఈ రెండు రాష్ట్రాలు మైక్రో ఇరిగేషన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్నాయి. మైక్రో ఇరిగేషన్ వినియోగించే రైతులకు 90 శాతం సబ్సిడీని అందిస్తున్నాం. మైక్రో ఇరిగేషన్ ద్వారా లక్ష హెక్టార్లకు 15 టీఎంసీల నీరు ఆదా అవుతుంది. ఏడేళ్లలో 105 టీఎంసీల నీరు ఆదా అయినట్టే. అలాగే రూ.434 కోట్ల విలువైన 10,871 లక్షల కిలోవాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే 364 లక్షల పని దినాలు కూడా ఆదా చేసుకున్నట్టే. దీని విలువే రూ.1820 కోట్ల మేర ఉంటుంది. 35 వేల టన్నుల యూరియా కూడా రైతులకు ఆదా అవుతుంది. మొత్తంగా రూ.8 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని రైతులు సాధించినట్టే. ఉద్యాన రంగానికి సంబంధించి క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ పైనా ప్రధానంగా దృష్టి పెట్టాం. ఈ రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా గరిష్టంగా ఆదాయం సాధించే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వివరించారు.
మెరైన్ ఎకానమీపై శ్రద్ధ పెడతాం
ఆక్వా కల్చర్ తో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ ఏపీ నెంబర్ వన్‌గా మారే పరిస్థితి తీసుకువస్తాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ప్రింప్ (రొయ్య) విలవిల లాడుతోంది. రూ.21 వేల కోట్ల ఆక్వా ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయి. అమెరికా టారిఫ్‌లు పెరిగిపోవటం వల్ల ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నాం. రిజిస్ట్రేషన్లు చేసుకుంటే… జోన్లకు అతీతంగా అక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను అందిస్తున్నాం. రూ. 1000 కోట్ల భారం పడినా ఆక్వా రైతును అదుకునేలా చర్యలు చేపట్టాం. ఆక్వా ఫీడ్ కూడా కేజీకి రూ.9 చొప్పున ధర తగ్గించేలా కంపెనీలతో మాట్లాడాం. ఆక్వాకు కొత్త మార్కెట్లను అన్వేషించేలా కేంద్రంతో సంప్రదింపులు జరిపాం. ప్రత్యామ్నాయంగా దేశీయంగా వినియోగాన్ని పెంచేలా చూస్తాం. మెరైన్ ఎకానమీని పెంపోదించడంలో భాగంగా సీవీడ్ కల్చర్‌పై కూడా దృష్టి పెడుతున్నాం. ఈ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. సీ వీడ్ ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.
అతి పెద్ద ఆదాయ వనరు
వ్యవసాయ రంగమే
రాష్ట్రంలో 35 శాతం జీఎస్టీపీ వ్యవసాయ ఆధారితంగానే వస్తోంది. వ్యవసాయ రంగం ద్వారా రూ. 5.17 లక్షల కోట్లు, పారిశ్రామిక రంగం ద్వారా రూ.3.40 లక్షల కోట్లు, సేవల రంగం ద్వారా రూ.6.12 లక్షల కోట్ల గ్రాస్వల్యూ ఎడిషన్ వస్తోంది. ఒక్క పశు సంవర్ధక రంగం నుంచే రూ.1.95 లక్షల కోట్ల జీవీఏ వస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవల రంగం నుంచి రూ. 17.12 లక్షల కోట్ల జీవీఎను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ రంగాల్లో 17.11 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆహార అలవాట్లు మారుతున్నాయి. దీనికి అనుగుణంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో లైవ్ స్టాక్ ద్వారా 19 లక్షల మందికి నేరుగా జీవనోపాధి కలుగుతుంది. భవిష్యత్తులో అతిపెద్ద ఆర్థిక లావాదేవీలకు ఆస్కారం ఉన్న రంగంగా లైవ్ స్టాక్ ఉంటుంది. ఉద్యాన రంగం రాష్ట్రంలో రెండో గేమ్ ఛేంజర్ మారుతుంది. 18.57లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నాం. కూరగాయలు, పండ్లు, మసాలా దినుసులు, తదితరాలను పెద్ద ఎత్తున పండించుకునే అవకాశం ఉంది. హార్టికల్చర్, ఆక్వా కల్చర్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చే రంగాలుగా మారతాయి. 2029 నాటికి రాష్ట్రంలో ఉద్యాన పంటలను 25 లక్షల హెక్టార్లకు పెంచుతాం. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశానికి హార్టికల్చర్ హబ్ గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.